పుట:Rangun Rowdy Drama.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

రంగూన్‌రౌడీ.

గంగా - (స్వగతం) ఇప్పుడు వీనిపిలక నాపిడికిట నిఱికినది. దీనిని సర్వనాశనము చేసిగాని విడువను. ( ప్రకా ) సరే కాని, నీ వీముసలివాని నేల హత్యచేసతివి ?

శంక - నాతండ్రి వీనికివ్రాసియిచ్చినపవరునామా వీనిచేతఁజిక్కుటచేత.

గంగా - ఆపవరునామా యేది?

శంక -- (ఇచ్చి) గంగారాం ! గంగారాం! నీకు నమస్కరింతును. నా ప్రాణము లిప్పుడు నీచేతిలో నున్నవి. నన్నుఁ జంపినను బ్రతికించినను నీవే.

( తెరలో) ఖూనీ ! ఖూనీ ! పకడో ! పకడో !

శంక - గంగారాం ? ! గంగారాం ! పోలీసులు వచ్చుచున్నారు. నేను పారిపోవలెను. రక్షింపుము ! రక్షింపుము !

గంగా - అంత భయముగలవాఁడవు హత్యయేలచేసితివి? ఉండు. పోలీసులు రాకుండ తలుపులు వేసెదను. (తలుపులు వేసి వచ్చి) రెండుషరతులకు సమ్మతించితివా బ్రకికెదవు. లేదా పోలీసువారి కప్పగింతును.

శంక - దేనికైనను సమ్మతింతును. త్సరగా చెప్పుము.

గంగా -- ఈపవరునామామీఁద నీఆస్తియంతయు నాకు వ్రాసియిచ్చుట యొకటి. ఈ ఖూనీని నీవు చేసినట్లు సమ్మతిపత్రము వ్రాసి యిచ్చుట రెండు.

(తెరలో మరల) ఖూనీ! ఖూనీ! పకడో ! పకడో !

శంక - అట్లే వ్రాసియిచ్చెదను, వేఱొకకాగితమును త్వరగా నిమ్ము.

గంగా - (ఇచ్చును)

శంక - (రెంటిపై వ్రాసయిచ్చి) గంగారాం ! ఇఁక సెలవు. నన్నీ పోలిసువారు పట్టుకొనఁ గల్గినప్పుడు చూచుకొందునులే.

(పారిపోవును.)