పుట:Rangun Rowdy Drama.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

రంగూన్‌రౌడీ.

రంకా - వారికి కూటికి గతిలేని కర్మమేమి ?

శంక - కర్మమా ! కర్మమే | పోషించుదిక్కు లేక .

రంగా - వారికి దిక్కులే కేమిరా ! జ్ఞానహీనుఁడా ! మగఁడును తండ్రియును సంపాదించిన ద్రవ్యమునకు వారి కధికారములేదా?

శంక - ముసలిపీనుగా ! మర్యాద నెఱిఁగి మాటాడుము. దూషించితివా తల చిదుకఁగొట్టగలను. శంకరరావు నే మనుకొంటివో? నీవు సేవకుఁడవు. నేను ప్రభువును. జాగ్రత్త !

రంగా - (చెవిపట్టుకొని) అరే బేటా ! నాకండ్లయెదుట పుట్టి పెరిగిన శుంఠవు ! నేఁటి కెంతవాఁడవైతివిరా ? ఇప్పుడు నీవుగావు ప్రభుఁడవు - నేను. నీతల్లికి, చెల్లెలికి, భార్యకు, నీకు తిండి పడ వేయవలసినవాఁడను నేను. నీవుకావు తెలిసినదా ?

శంక - ఆఁ! ఆఁ! ఒడలు తెలిసికొని మాటలాఁడు.

రంగా - ఆఁ ! ఒడలు తెలియదు. త్రాగి......కన్నులువిప్పి యిటుచూఁడు. ప్రాణములు విడుచునప్పుడు నీతండ్రి నాకు వ్రాసి యిచ్చిన పవరునామా తెలిసికొంటివా ? ఇది సర్కారుస్టాంపు కాగితము. వట్టిది కాదు. బ్రిటిషుబావుటా, నీవు చచ్చిన చావ వలసినదేకాని, నా కీ యధికారము తప్పదు. ముండనువలె మూలఁ గూర్చుండఁబెట్టి నీకు నెల కైదువందలచొప్పున నేను భరణమిచ్చెదను. బ్రతుకుతెరువు చూచుకో !

గిరి - నడుమ నా కీశని యెక్కడ దాపురించెను ?

రంగా - (బుగ్గపై పొడిచి) ఓసీ ఛటకారీ ! నేను శనివలె నీకన్నులకుఁ గనఁబడుచుంటినా ? శంకరరావుడబ్బు చౌకగా నున్నదని వాని కొంప వల్లకాటఁ గలుపవచ్చిన శనివి నీవు కావా ? త్రాగి తందనములాడుచు......ఛీ ! ఓరీ సేవకా !

సేవ - అయ్యా ! ఏమి సెలవు ?