పుట:Rangun Rowdy Drama.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రధమాంకము.

5

వాసమున జన్మించిన కుమారులైన మీరు లోకముకొఱకైనను రవంత దుఃఖమునైన సూచింపవలసిన విధాయకముగాదా! వృద్ధులైన మామగారు శాశ్వత బ్రహ్మకల్పముగా జీవించియుందురా? ఎన్నఁడో యొకనాఁడు మరణింపవలసినవారేకదా! వారి యనంతరమున నీయైశ్వర్యముల కధికారులు మీరే కదా! ఇంతలో మీరిట్లు వెలితిపడుటను జూచి లోకు లన్యధా తలంపరా?

శంక - ఛీ! ఇట్టి మనో వ్యాకులప్రద మగు ప్రసంగమును వినలేకయే నేను కొంపకుఁ గూడ వచ్చుట మానివేసితిని. మఱల నీదిక్కుమాలిన యుపన్యాసముల నారంభించితివి. గిరికుమారి యెన్నఁడైన నిట్లు మాటాడియెఱుంగునా ? దానికిఁగల జ్ఞానము నీకేల లేదు పశువా!

అన్న -- నాధా ! పడుపువృత్తిగల గిరికుమారిని సంసారి నగు నాతోఁ బోల్పఁదగునా? మీతో నిట్టిప్రసంగ మొనరించుటకు మీ మంచిచెడ్డలతో దాని కేమి యవసరము ? ఎట్లైన మీ మనస్సు రంజింపఁజేసి ధనార్జనచేయుటయేకదా దానివృత్తిధర్మము! గిరికుమారి మీవలస నిప్పటికి లక్షాధికారిణి యైనదిగాదా ?

శంక - ఛీ ! నోరు కట్టిపెట్టు. న న్నేమైననందువుగాక ! దానిని మాత్రము దూషించినయెడల నే నోర్చువాఁడను గాను. దానియైశ్వర్యములం జూచి నీకింత కడుపుమంట యెందులకు? నీవుగాని - నీయబ్బ, మరి యెవ్వఁడైన, గాని - దానిని లక్షాధికారిణినిగాఁ జేసినారా?

అన్న - రామరామ! దాని నేమని దూషించితిని ? తమయర్థాంగి నగు నా కీమాత్రపు సంభాషణమునకైన నధికారము లేదా ?

శంక - లేకేమీ! సర్వాధికారములును నీవేకదా ! గిరికుమారి యెవ్వతె - పడుపుముండ? దానికొంపకే పోవుదును లే? నీ యధికారములతో నీ విందే యుండుము. (పోఁబోవును.).