పుట:Rangun Rowdy Drama.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాంకము.

97

కాఠిన్యముచేనైన సరే ! నన్ను సంహరింపుఁడు. (తలబాదుకొని) అయ్యయ్యో! ఈకష్టజీవికి అంతటిభాగ్య మెక్కడిది? కలుషములుతాండవించు ఈపాపి మొగముంజూడఁజాలక కాఁబోలును పౌరులందఱును తలలు వంచుకొని సందుసందులఁబడి పోవుచున్నారు ! హా హా ! మాతృశాప మూరకపోవునా ! వేశ్యాసురాపానలోలతచే నొడలుమఱచికన్నతల్లికి, తోబుట్టువునకు, ధర్మపత్నికి ఒక్క కడియన్నమైనంబెట్టక, కడుపుఁగాల్చిన పాప మూరకపోవునా ? అన్నపూర్ణా! నీతండ్రిని చంపి, ఆ హత్యాదోషమును నీపైనిడి మొద్దువలె బ్రతికియున్న పాపాత్ముఁడగు శంకరరావు ఇడుగో ! నీవైన శపింపుము. నీవు మహాసాధ్వివి. నీశాపముచే తలపగిలి నేను చత్తునను నమ్మకమున్నది. శపింపుము - శపింపుము. అన్నపూర్ణా ! పతియాజ్ఞ మీరరానిదిగదా ! శపింపుము; శపింపుము. అయ్యయ్యో ! నీవేల నన్నుశపింతువు! ఎన్నిసారులో నన్ను రక్షించుటకై నీ ప్రాణములను సైత మియ్య సిద్ధమైన నీవు నన్ను శపింపపు, నే నెఱుఁగుదును. అయ్యయ్యో! నాకేదిదారి. అన్నపూర్ణా ! ఎక్కడనున్నావు ! ఆహా ! అన్నట్లు మఱచితి. నీవీపాటికి వధ్యశిలపై నుందు వేమోగదా? ఓ న్యాయాధికారి! ఉండుము. ఒక్క క్షణ ముండుము. నీవు నిజమైన న్యాయాధికారివైనచో ధర్మపరిశీలన చేయుము! తులసీరావును చంపిన ద్రోహియెవ్వరో కనుగొని శిక్షింపుము. అన్నపూర్ణ చంపినదను కొంటివా! ఓ వెఱ్ఱివాఁడా! నా అన్నపూర్ణ - పవిత్రురాలగు నాఅన్నపూర్ణ - మహాపవిత్రయైన నా అన్నపూర్ణ - తండ్రిని - కన్నతండ్రిని - చంపగల హంతకురాలనియే నమ్ముచున్నావా ! ఛీ! నీన్యాయము మండిపోయినది. నీ తెలివి తగులఁబడిపోయినది. ఆపీఠమునకు ఆపావనమైన న్యాయపీఠమునకు నీ వనర్హుడవు. అర్హుఁడ వైనచో చెప్పుము. ఎవ్వరు తులసీరావునుహత్యచేసినవారు ? నీ తెలివి దీనితో తేట తెల్లమగును. హ - హ్హహ్హ - హంతకు నన్వేషింప నీకు సాధ్యమగునా? వట్టిది వట్టిది శంకరరావు- (ఱొమ్ము బాదుకొని) - యీ