పుట:Rangun Rowdy Drama.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

రంగూన్‌రౌడీ.

    నీచధనాశాపిశాచదుర్బుద్ధిచే
                 సద్భ్రాహ్మణోత్తముఁ జంపినాను
    రంగూనులో నన్ను రక్షించినట్టి ర
                 క్షకుని తుపాకిచేఁగాల్చినాను.
     అతని దారాధనం బపహరించియు ఘోర
                 విధి ననాధనుజేసి విడిచినాను

     పరమసాధ్వియైన భార్యను రంపానఁ
     దరిగినాను కాలఁదన్నినాను
     కడకు మామగారిఁ గడతేర్చి హత్యను
     గాంత తలను బెట్టి కట్టినాను.

హా! హా! దారుణము ! దారుణము ! మహాదారుణము ! భరింపఁజాల. పశ్చాత్తాపమహానలము యీ కలుషశరీరము నాపాదశిరఃపర్యంతమును కాల్చివేయుచున్నది ! ఓ మహాజనులారా! చూచితిరా! యీపాపాత్ముని దుశ్చరిత్రమును. ఇట్టిపాపభూయిష్టచరిత్రముగల నరహంతకు నెన్నడైనఁ గాంచియుంటిరా! కధలో నైన వినియుంటిరా! కలలోనైన నూహింపగలరా! కల్ల - కల్ల. పూర్వకాలమున జరిగినట్లు కధలుగా చెప్పుకొను పుక్కిటి పురాణములయందలి భయంకరరాక్షసులైన నేను చేసినన్ని దుష్కృత్యములు, నేను చేసినన్ని హత్యలు, నేను పలికినన్ని యనృతములు, నేను సలిపినన్ని దారుణకార్యములు కావించియుందురా ! భగవంతుఁడైన, నీచండాలుని శిక్షింపఁ దగినన్నిశిక్షలు తనశిక్షాస్మృతియందు లేకుండుటచే నిట్లు వదలినాఁడు కాఁబోలును. ఓపౌరులారా ! ఓజానపదులారా ! మిమ్మందఱను ప్రార్థింతును. నాజీవితమున కంతముఁగలిగించి యీపరితాపమునుండి విముక్తునిఁ జేయుఁడు. నాజీవితమధ్యమునం దింతవఱకు ఒకరిని ప్రార్థించియెఱుగను, ఒకరిని చంపుటయేగాని, ఒకరిచేచంపఁబడి యెఱుంగను. ఇట్టి నేను, నేను, ప్రార్థించుచున్నాను. కనికరముచేనైన సరే!