పుట:Ranganatha Ramayanamu.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రావణు లోకవిద్రావణుఁ గాంచి - "దేవ! నేఁ డొకకోతి తెగువమై వచ్చె.620
తొలి తొలి వైదేహితో మాటలాడి - కలగొన వనమెల్లఁ గాసిలఁ బెఱికి
వినుఁ దన్ని యెనిమిదివేలరాక్షసుల - వనపాలకులఁ జంపి వ్రాలుచున్నాఁడు.
వాఁడు రాఘవుఁ డంప వచ్చినవాఁడు - కాఁడేని యాసీత గాపుగా నున్న
తరువొక్కటియుఁ దక్క తావకవనము - కర మల్గి పెఱుకంగఁ గారణం బేమి?
వానితెఱం గేమి? వైదేహి నడుగఁ - దా నెఱుంగ నటంచు దాఁచుచున్నదియు;"
నావుడు నల్గి దానవలోకవిభుఁడు - రావణుఁ డుగ్రనిగ్రహదృష్టిఁ జూచి
దీపాగ్రనిర్గతదీపతై లంబు - లై పావకజ్వాల లక్షులఁ దొఱుఁగఁ
దనకింకరులఁ బంచె దండిరాక్షసుల - నెనుబదివేవుర నిద్దవిక్రములఁ
బనిచినఁ బనిబూని బలియులై వారు - ధనురస్త్రశూలముద్గరభిండివాల
ఘనగదాకరవాలకలితులై పేర్చి - యనికి సన్నద్ధులై యార్చుచు వెడల630
నంత సూర్యోదయం బయ్యె నౌటయును - నెంతయుఁ గడఁకతో నే పగ్గలించి
యకలంకగతిఁ బర్వతాకారుఁ డగుచు - మకరతోరణ మెక్కి మారుతాత్మజుఁడు
తనుఁ దాఁకి శస్త్రాస్త్రతతుల నొప్పించు - దనుజవీరులఁ జూచి దర్పించి పలికె.
"నోరి! రాక్షసులార! యుర్విపై నేను - శూరత విలసిల్లు సుగ్రీవుబంట
రామునిదూత నారాముసేమంబు - భూమిజతోఁ జెప్పి పోవుచున్నాఁడ;
హనుమంతుఁ డనువాఁడ నతిబలాధికుఁడ - నినతనూజుని మంత్రి నే వాయుసుతుఁడ
పూని లంకాపురంబున నున్న మగల - కే నంతకుండనై యిట వచ్చినాఁడఁ
జెడఁగోరి న న్నేల చెనకెద" రనుచు - వడిఁ బేర్చి యాభీలవాలంబునందుఁ
బదుల నూఱుల వేల బలియుఁడై పట్టి - త్రిదశారివరుల బంధించి బంధించి
యారూఢవిక్రమాహవకేళిఁ దేలి - తోరణస్తంభంబుతో వేసి వేసి640
పూని యొక్కని నైనఁ బోరిలో బ్రదికి - పోనీక నిశ్శేషముగఁ జంపివైచె.
నంతలో ఫణిహారు లమరారికడకు - నెంతయు భీతులై యేతెంచి మ్రొక్కి
"దనుజేశ! విను కోఁతి తనదువాలమున - నెనుబదివేవుర నేపుమైఁ జంపి
మలయుచునున్నాఁడు మకరతోరణము - తలదన్ని రణబలోదగ్ధుఁడై" యనిన
ఆపంక్తిముఖుఁడు కాలాంతకుపగిది - కోపించి పింగళాక్షుని దీర్ఘజిహ్వు
వక్రనాసుని నశ్మవక్షుని వైరి - చక్రభీకరుఁడైన శార్దూలముఖుని
వేవేగ రప్పించి వీరులై మీర - లావానరునిఁ దెగటార్చి రమ్మనుచుఁ
బనిచిన నేవురు ప్రబలసైన్యములు - కొని రథారూఢులై క్రూరులై వెడలి
పరువడి నార్చుచుఁ బవనజుఁ దాఁకి - శరవృష్టిఁ బొదవినఁ జలియింప కాతఁ
డాతోరణంబుపై నార్చుచుఁ బేర్చి - వాతూలస్తుతుఁ డేఁచి వాల మంకించి650
రథముల విఱిచి సారథుల నుగ్గాడి - రథకురంగంబుల రణవీథిఁ ద్రుంచి