పుట:Ranganatha Ramayanamu.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వారణంబులఁ గూల్చి వాజుల గెడపి - యారాక్షసులసేన నట రూపుమాపి
ధరణికి లంఘించి తనదువాలమున - నురుశక్తి గళముల కుఱిగా బిగించి
యురువడి కనుగ్రుడ్లు నుఱకంగఁ ద్రిప్పి - సురుఁగక వక్రనాసుని వ్రేసి చంపెఁ
జంపి యంతటఁ బోక సమయని కినుకఁ - దెంపు సొంపును బెంపు సొంపు దీపింపఁ
బెడపెడ నార్చుచుఁ బిడుగునకంటె - బెడిదమై కనుపట్టు పిడికిటిచేతఁ
బుడమిపై నురురక్తములు గ్రక్కి కూల - వడి నశ్మవక్షుని వక్షంబు పొడిచె
పొడిచి బాహాగర్వమున మాఱులేక - కడఁకఁ గనుంగొని కఱకురాక్షసుల
మొగి ద్రుంచి శార్దూలముఖు లలాటంబు - పగులంగ గద ద్రిప్పి పడవైచి చంపె
నటు చంపి క్రోధాగ్ను లందందఁ నిగుడఁ - గుటిలరాక్షసకులక్షోభంబు గాఁగ660
గ్రూరుఁడై పింగళాక్షునితోఁకఁ గట్టి - కారాకు సుడిగాలి గడువడిఁ ద్రిప్పు
తీరున వాని దిర్దిర మింటఁ ద్రిప్పి - తోరణస్తంభంబుతో వేసి చంపె
వాని నిమ్మైఁ జంపి వరశక్తియుక్తి - పూని దానవసైన్యములఁ జొచ్చి కలఁచి
యురవడి దీర్ఘజిహ్వుని వచ్చి తాఁకి - యురుముష్టిసంహతి నుర్విపైఁ గూల్చి
యాలోనఁ బవనజుఁ డసమానవిజయ - లోలుఁడై వానినాలుక పీకి చంపె.

హనుమంతునిమీదికి రక్తరోముఁడు మొదలైన రాక్షసుల రావణుఁడు పంపుట

నంతఁ దక్కినదైత్యు లటఁ బాఱిపోయి- యంతయుఁ జెప్పిన నద్దశాననుఁడు
సోమించి నిజమంత్రిసుతులైన రక్త - రోముని శతజిహ్వు రుధిరలోచనుని
స్తనితహస్తుని శూలదంష్ట్రు దుర్ముఖుని - ఘనుఁ డగు నవ్యాఘ్రకబళునిఁ బిలిచి
"యిది యొక్కవానరుఁ డేచి రాక్షసులఁ - బొదివి పెక్కండ్రఁ జంపుచు నున్నవాఁడు
ఆమర్కటునిఁ జంపుఁ" డని పూని పనుప - నామహాబలగర్వు లార్చుచు వెడలి670
చతురంగబలము లసంఖ్యలు గొలువ - నతులరథారూఢు లై పేర్చి వచ్చి
మకరతోరణముపై మాఱు లే కిట్లు - నకళంకుఁడై యున్న హనుమంతుమీఁద
వరదివ్యశస్త్రాస్త్రవర్షము ల్గురియఁ - బరమపావనుఁడైన పవమానసుతుఁడు
అప్పు డాదైత్యులయస్త్రశస్త్రములు - దప్పించుకొనుచును దను దాఁకకుండఁ
దననఖాగ్రంబుల దంతకుంతముల - ఘనపాదకూర్పరకరఘట్టనములఁ
జెలరేఁగి వడి మహాశిలల వృక్షముల - బలముల నలుగడఁ బఱపి నుగ్గాడి
కంఠీరవంబును గజములపైకిఁ - గుంఠితగతిఁ దాకిఁ కుప్పించుకరణిఁ
బటుమాంసమస్తిష్కవారము ల్చెదర - కుటిలోగ్రనఖములఁ గుంభము ల్వ్రచ్చి
లేళ్లపైఁ బులి చౌకళించినపగిదిఁ - ద్రుళ్లుగుఱ్ఱములఁ దోడ్తో రూపు మాపి
జంతుపారణ సేయు జమునికైవడిని - బంతంబుతోఁ గ్రాలు బలము మాయించి680