పుట:Ranganatha Ramayanamu.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యారూఢబలవిక్రమాస్పదం బయిన - నీరూప మెట్టిదో నిజముగాఁ జూపు;
మేను నీనిజరూప మేర్పడఁ జూచి - కాని నా తలమానికము నీకు నీను;"590
అనిన నాహనుమంతుఁ డాకాశ మెల్ల - దనమేను నిండ నుద్దండుఁడై పెరిగి
మాలతీమల్లికామాల్యమై మెడకు - నాలోలతరతారహారమై కటిని
గలధౌతమయఘంటికాదామ మగుచు - దళుకుచుక్కలపిండు తనమేన నలమ
నతిభీషణాకారుఁ డై నిల్చుటయును - నతివ చిత్తములోన నతిభీతిఁ బొంది
“యసమానగాత్ర! యోయంజనాపుత్ర! - విసువక నీరూపు వెన దాఁచు" మనుచు
హనుమంతుఁ గొనియాడి యతని దీవింపఁ - దనవిశ్వరూపంబు తగఁ జూచి సురలు
వినుతింప నది దాఁచు వెన్నుండు వోలె - ననిలజుఁ డెంతయు నలఁతియై నిలిచె.
నిలిచిన హనుమంతు నెమ్మిమైఁ జేరఁ - బిలిచి లోఁగొంగున బిగియంగఁ గట్టి
యున్న శిరోరత్న మొయ్యన విడిచి - యన్నాఁతి ప్రీతిమై నపు డొసంగుటయు
వనితశిరోమణి వలనొప్ప నంది - కొని మ్రొక్కి సీత వీడ్కొని వేడ్క నరిగి600
పంతంబు తా నింకఁ బంక్తికంఠునకు - నింకటఁ దనరాక నెఱిఁగింతు ననుచుఁ
“దల్లి నే నాకొంటిఁ దనరఁగ వనము - నెల్లెడ ఫలములు నేను గైకొందు"
ననవుడు సీత యాహనుమంతుఁ జూచి - యనె "రాక్షసావళి యల్ల కాపుండుఁ
గ్రమ్మి రాలినపండ్లు క్రమముతో నమలి - పొమ్ము వేగ" యటంచుఁ బొందుగా ననుప
దనమదిఁ గొండొకతడవు చింతించి - వనభంగ మొనరించువాఁడునై పెరిఁగి
తొడలందు బొడము వాతూలఘట్టనల - బడుగుఁ బేకయుఁ బోలెఁ బడ మహీజములు

హనుమంతుఁడు అశోకవనమును జెఱుచుట

ఆనిత్యమతి యశోకారామభూమి - మానైనహర్మ్యము ల్మహిఁ గూలఁ దన్ని
యొనర కేళీగృహంబులు నుగ్గుఁ జేసి - వనమహీరుహములు వడి నేలఁ గలిపి
కొమ్మలు ఖండించి కుసుమము ల్రాల్చి - కమ్మతేనెలు చల్లి కాలువ ల్చెఱిచి
పూవుఁదీఁగెలు ద్రెంచి పొదరిండ్లు చదిపి - వాపులు గలఁచి దోర్బలకేళిఁ దేలి610
కలకంఠబకబిసకంఠికాక్రౌంచ - కలహంసశుకశారికామయూరాది
వనపక్షు లార్తరావములతోఁ బాఱ - వనపాలకులు భీతి వడి మేలుకాంచి
హనుమంతుసేఁతకు నగ్నులై మండి - యనుపమకరవాలహస్తులై కదియఁ
దనపేరు తనరాక తనపరాక్రమము - వినఁ జెప్పి శ్రీరామవిభు కూర్మిబంట
నొక్కొక్కరాక్షసు నుద్దండవృత్తి - నొక్కొక్కతరువుతో నొగిఁ గూలనేసి
ప్రథమసంగరకళాపారంభుఁ డగుచుఁ - బృథివిపైఁ బీనుఁగుఁబెంటలు గాఁగ
భూరిసత్వంబులఁ బొలుపొందువారి - వీరుల నెనిమిదివేలరాక్షసులఁ
బవమానతనయుఁ డప్రతిముఁడై పేర్చి - యవలీలఁ దెగటార్చి యార్చినఁ జూచి
యేపఱి ధృతి దూలి యినవంశుదేవి - కావుపున్న ఘోరరాక్షసభామ లరిగి