పుట:Ranganatha Ramayanamu.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గాకుత్స్థతిలకుఁ డొక్కఁడ నిద్రఁ దేరి - కాకంబుపై నిషీకము ప్రయోగింప
నదియు బ్రహ్మాస్త్రమై యఖిలలోకైక - విదితోగ్రశక్తిమై వెనువెంట నంట
నాకాకి యేకాకి యై యెందుఁ దిరిగి - కైకొని తనుఁ గావు కావు మటంచు
మరలి క్రమ్మఱఁ దనమరుఁగుఁ జొచ్చుటయు - శరణాగతత్రాణచరితుండు గాన 560
దానినేత్రము నిజాస్త్రమున కిప్పించె - నానిమిత్తంబుగా నలినాప్తకులుఁడు
నాటి నాపై ప్రేమ నాటియస్త్రంబు - నేటికి మఱచెనో? యిది హెచ్చరింపు;
పదివేలభంగుల బాధలకోర్చి - పదినెల లడపితిఁ బతిఁ బాసి యేను;
నాయున్కిఁ జూచితి నాపాటు గంటి - యేయుపాయంబుల నిం దోర్వరాదు;
ఉడుగనివగలతో నొక్కొక్కదినము - గడచు టొక్కొకవార్ధి గడచుట నాకు
నరనాథుమదిలోన నామీఁదఁ జాలఁ - గరుణ పుట్టెడునట్లుగా విన్నవింపు;
మాతండ్రి జనకుండు మహిమీఁదఁ దన్ను - నేతెఱంగున వీరుఁ డితఁ డని నమ్మి
తనకు నిచ్చినఁ దెచ్చి తగదు న న్విడువ - నని యేను బల్కితి నని పల్కు మీవు
విలసిల్లు కల్యాణవేదిపై నుండి - వలనొప్ప నగ్నిదేవర సాక్షి గాఁగఁ
గర మొప్ప న న్నెల్లకాలంబు విడువ - నరసి రక్షించెద నని తెచ్చి నన్ను570
నరయ కుపేక్షించి యనదఁగాఁ జేసె - పరికింపుఁ డని విన్నపము సేయు మనఘ!
తనయింతి నొకనిచేఁ దాఁ గోలుపోయి - మన నిచ్చఁజేయుట మగపాడి గాదు
అటుగానఁ దన కిది యపకీర్తి గాన - ఇటు విన్నవించితి నింతయే కాని
కలఁగక నామనోగతులఁ బ్రాణంబు - లొలసి త న్నెడఁబాయకున్నది యనుము
చతురాత్మ! మఱి నీవు సౌమిత్రిఁ జేరి - యతనితో నొక్కమా టాడుము తెలియ
నను దల్లిగాఁ జూచు నాపాటుఁ జూడ - తన కెన్నిభంగులఁ దగ దని చెప్పు
వావిరి దండకావనములోఁ బరమ - పావనుఁ డగు తన్ను పలికినఫలము
కుడిచితినని చెప్పు కొదువ లేకుండ - తడయకు మని తెల్పు దయ బుట్టఁ జెప్పు
నవసరోచితముగా నంగదుతోడ - రవిజుతోఁ దక్కు మర్కటకోటితోడ
నినయము ల్వలికి యెవ్విధి నైన వారి - నినకులులను వేగ నిటకుఁ దో డ్తెమ్ము;580
మిక్కిలి తెగువమై మీరాక తెలిసి - యొక్కమాసము చూతు నుండ లే నవల;
ఈలోన రఘురాము నెబ్భంగి నైన - వాలాయముగఁ దెమ్ము వడి నింకఁ బొమ్ము”
అని సీత పల్కువాక్యము లెల్లఁ దెలియ - విని హనుమంతుండు విమలుఁడై పలికె.
“అవుఁ గాక చెప్పెద నన్నికార్యములు - నువిద! నీమదిలోన నూరడు మింక
నచ్చుగా రఘురాము నంగుళీయకము - తెచ్చి యొప్పించితి దేవి। నీ కర్థి
ధరణిజ! రిక్తహస్తంబులతోడ - మరలుట దూతధర్మము గాదు నాకు;
అతివ! ముద్రారత్న మాన తిమ్మనిన - నతనితోఁ దెలియ నయ్యవనిజ పలికె.
"నీవు విచారింప నిసుమంత గాని - లేవు; సముద్ర మేలీల దాఁటితివి?