పుట:Ranganatha Ramayanamu.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నీకృప పడసితి నినుఁ జూడఁగంటి - నా కింత చాలదె? నలినాయతాక్షి!"
అనిన సీతాదేవి యనియె వెండియును - “మనుజేశుసేమంబు మఱఁదిసేమంబు
మనమార నడుగుచు మమత రెట్టింప - ననఘాత్మ! రఘురాముఁ డభిరామబలుఁడు
నను నెడఁబాసి యున్నాఁడ ధైర్యమున? - ననుజుండు దానును నప్పటప్పటికి530
దయ నన్నుఁ దలఁతురే? దండెత్తి యిటకు - రయమున వత్తురే రణకాంక్ష?" ననిన

హనుమంతుఁడు సీతతో శ్రీరామలక్ష్మణులక్షేమము దెల్ఫి శిరోరత్నము గొనుట

"వినవమ్మ! నీప్రాణవిభునిసేమంబు - నినుఁ బాసినదిమొద ల్నిత్యవేదనల
నేలపైఁ బవళించు నిద్ర యెఱుంగఁ - డోలి మాంసాహార మొల్లఁ డెన్నఁడును
వాసిమై దండకావనములో నిన్ను - మోసపోవుట లెంచు; మో మరవాంచు;
నిట్టూర్పు నిగుడించు; నించుఁ గన్నీరు; - నెట్టన మూర్ఛిల్లు నేలపైఁ ద్రెళ్లుఁ
దెలివిమై లేచు; నల్దిక్కులు చూచు; - గలఁకు నివ్వెఱగందుఁ; గళవళంబందు;
హా సీత! హా సీత! యని ప్రలాపించు - నాసుమిత్రాపుత్రుఁ డది చూచి వగచుఁ
గావున మీర లిక్కడ నుండువార్త - వేవేగ నాచేత విన్నంతఁ గదలి
నాకంటె ఘనులైన నగచరాధిపుల - భీకరాకృతుల నభేద్యవిక్రముల
నగశృంగతరుసంఘనఖముఖాయుధుల - నగణితబలుల దేవాంశసంభవుల540
సుగ్రీవనలవాలిసుతు లాదియైన - యుగ్రవీరులఁ గూడి యుదధి లంఘించి
యెల్లభంగుల వచ్చు నింతి! నీవిభుఁడు - తల్లి! ని న్గొని యయోధ్యాపురి కేగు;
రాముచే రణమున రావణుఁ డీల్గు - నీమదికోర్కులు నీకు సిద్ధించు;
నైన నీతడ వేల యఖిలైకమాత; - యేను నావీపున నిడికొని ప్రీతి
నొదవినగడఁకతో నుదధి లంఘించి - యుదయవేళకుఁ బోదు నుర్వీశుకడకు
విచ్చేయు"మనవుడు వెలఁది వాయుజుని - సచ్చరిత్రమునకు సంతోష మంది
“యోసమీరాత్మజ! యోపుదు వీవు - నీసత్త్వ మిట్టిది నిజము చింతింప
ననఘాత్మ! యేఁ బెండ్లి యైనదిమొదలు - జనలోకనుతు రామచంద్రునిఁ గాని
పొలుపొందఁగా నన్యపురుషాంతరములఁ - గలలోన నైనను గదిసి యే నెఱుఁగ
నీనీచమతి నన్ను నిటఁ దెచ్చుచోట - నంటుట కేను వేగుచుండుదును;550
వెఱవక బలిమిమై వీఁ డంటెఁగాని - మఱి యన్యపురుషుల మది నంట నేను;
నానాథునకు నీవు నమ్మినబంట - వైనను నిను నెక్కి యరుదెంచు టొల్ల;
తనదేవి మ్రుచ్చిలి దైత్యుండు చనిన - నినకులుం డారీతి నేతెంచె నండ్రు;
ఇది విచారము గాదె? యినకులేశ్వరుఁడు - కొదలేక మును చిత్రకూటంబునందు
నొకనాఁడు తనతొడ నొఱిఁగి నిద్రింపఁ - గ్రకచోగ్రముఖ మొక్కకాకంబు చేరి
చంచుపుటంబునఁ జనుఁగవ నడుమ - పొంచి చించిన రక్తపూరంబు దొరుఁగఁ