పుట:Ranganatha Ramayanamu.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలువలపై బ్రేమ గల చందమామ - కలితబింబలలామగతి నుదయించి90
జలరాశిఁ దేలించి జలజషండముల - గలవాసి దూలించి గిబ్బిజక్క వల
విరహార్తి నెలయించి వెడవింటివాని - వరకీర్తి నలయించి వాడినకలువ
మొత్తము నలరించి ముగ్ధజారిణుల - చిత్తంబు లదరించి చిమ్మచీఁకటుల
పంతంబు దరలించి పదునైనచంద్ర - కాంతంబుఁ గరఁగించి ఘనచకోరముల
విందులఁ దనియించి విటవిటీజనుల - పొందుల నలయించి పూర్ణచంద్రికల
దిక్కుల కెల్లను దెలివి దీపించి - చుక్కలగమిగాఁడు చూపట్టె మింట
పావని వీ డెల్లఁ బరికింపవలసి - దేవత లెత్తిన దీపమో యనఁగ
నట్టిచందురుఁ జూచి యంతరంగమునఁ - దొట్టినవేడ్క వాతూలనందనుఁడు
అఱయోజనము వెడల్పై యోజనంబు - విరివియౌ నొకయిల్లు వేగ కన్గొనుచు
నంతఃపురం బెల్ల నరయుచు రత్న - కాంతవంతము విశ్వకర్మనిర్మితము100
కామచారము చిత్రకరకౌశలంబు - సోమార్కనిభమునై సురలోకవైరి
యాకుబేరునిఁ దొల్లి యాజిలో గెలిచి - గైకొన్నమణిపుష్పకంబు వీక్షించి
యావిమానంబులో నంగనామణులు - రావణు సౌఖ్యవారాశిఁ దేలించి
పానాభిరతికేళి పరవశ లగుచు - మేనుదీఁగెలు సోల మిసిమిపెందొడల
పస బయ ల్పడి నీవిబంధము ల్జార - వసివాళ్లు వాడిన వదనంబు లడరఁ
గమ్మనిట్టూర్పులు గ్రమ్మఁ గెమ్మోవు - లెమ్మెయిఁ గైవ్రాల నెలనవ్వు దేర
నరమోడ్పుఁగనుఁగవ లంగజుకేళి - పరవశత్వముఁ దెల్పఁ బాదపద్మముల
నందియ ల్రొద సేయ నమ్మోములందుఁ - జందనతిలకము ల్శ్రమవారిఁ గరఁగ
వేణీభరము వీడ విరిదండ లూడ - నాణిముత్యముపేరు లత్యంతకఠిన
వక్షోజపర్వతద్వయి చిక్కువడఁగ - నక్షు లాసవమదాలసతఁ జెన్నొందఁ110
గటిసైకతంబులఁ గచశైవలముల - స్ఫుటనాభిసరసుల భ్రూతరంగముల
స్తనచక్రముల విలోచనమీనతతులఁ - గనుఁపట్టి సుఖసుప్తిఁ గైకొన్ననదుల
కైవడి నిద్రించు కామనీమణుల - నావాయునందనుఁ డందందఁ జూచి
యిట్టిట్టిసతు లుండ నీరావణుండు - కట్టడియై రాముకాంతను దెచ్చెఁ
బరవధూమర్మము ల్పరికించుటకును - బురపురఁ బొక్కుచుఁ బుణ్యమానసుఁడు
స్వామికార్యార్థమై సతులమర్మముల - నీమాడ్కిఁ గనుఁగొంటి నింతియకాని
కానిసేఁతల వీరిఁ గనుఁగొన్నవాఁడఁ - గా నింతి నీయింతి గమిలోన వెదుక
వలను గా దనుచు భావమున నెన్నుచును - కలయఁ దా వెదకుచుఁ గానక యెచటఁ
జప్పుడు గాకుండఁ జనుచు ముందఱను - విప్పైన యొకరత్నవేదికమీఁదఁ
బువ్వుపాన్పున నిద్రఁబోయెడువాని - నవ్వాసవునిభోగ మణఁగించువాని120
సంజకెంపులతోడ జలదంబు వోలె - రంజితగంధాంగరాగంబువాని