పుట:Ranganatha Ramayanamu.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నీటైన సెలయేర్ల నీలాద్రివోలె - దేటముత్యపుపేర్లు దీపించువాని
నైదుమస్తముల ఘోరాహులఁ బోలెఁ - బ్రోది నంగుళిరమ్యభుజములవాని
జిలుఁగువెన్నెలతోడి చీఁకటివోలెఁ - జలువదుప్పటి మేన జత నొప్పువానిఁ
వెడదఁఱొమ్ముల నొప్పు వేల్పుటేనుంగు - కడిది కొమ్మున పోటుకైపులవానిఁ
గర్పూరమణిదీపకళిక లిర్వంక - నేర్పుమైఁ గదలించు నిట్టూర్చువాని
మకుటకుండలదీప్తిమయమూర్తివాని - సకలారిగర్వనిస్రావణుం డైన
రావణుఁ డనువాని రాక్షసాధిపుని - భావించి యాతనిపార్శ్వభాగముల
నడపంబు గట్టియు నాలవట్టములఁ - గడువేడ్కఁ బట్టియుఁ గరకంకణములు
రాయంగ వింజామరములు వ్రేసియు - హాయగాఁ బాడియు నాడియు వీణ130
మీటియు మద్దెల ల్మృదుమార్గలీల - సూటి వాయించియు సొక్కి యొండొరులు
తమసాధనంబులు తగఁ గౌఁగిలించి - తమి నిద్రఁ బోవు గంధర్వకామినుల
దేవకామినులు దైతేయకామినులు - భావించి యంత నాపరమపావనుఁడు
గగనమండలిచంద్రకళయును బోలె - మొగులుచెంత మెఱుంగు మొలకయుఁబోలె
నారావణునిశయ్య నభినవయౌవ - నారూఢయై దేవతాంగనకరణి
నున్న మందోదరి నొయ్యనఁ గాంచి - యన్నెలఁతుక సీత యని నిశ్చయించి
యవనిజ నేఁ గంటి ననుచు నానందు - వివశుఁడై గంతులు వేయుచు నచటి
కంభము ల్ప్రాకుచుఁ గలితవాలాగ్ర - చుంబనం బొనరింపుచును నటింపుచును
గాపేయజాతివికారము కొంత - సే పిటు చూపుచుఁ జిత్తంబులోన
మఱి వివేకముఁ బూని మనుకులేశ్వరుని - తెఱవ పతివ్రతాతిలకంబు పరమ140
పావని జనకభూపాలునిపుత్రి - దేవదేవుని రామదేవునిఁ బాసి
రావణుఁ గోరునే రాగిల్లి మధువు - ద్రావునే యిట్లేల తనబుద్ధి భ్రమసె?
నానావిధంబుల నాకుఁ జూచినను - దానవి గాని యీతరళాక్షి సీత
గా దని దెలిసి యక్కడ నుండ కవల - మేదురపరికరామ్రేడితామోద
మానితాసవరక్తమధుమాంసయుక్త - పానశాలాపరంపరలెల్లఁ జూచి
గరుడోరగామరగంధర్వసిద్ధ - వరసతు ల్చెఱ లున్న వాడలు చూచి

హనుమంతుఁడు ఉద్యానవనంబుఁ జూచుట

వారీదుఃఖంబులు వారియాపదలు - నారంగ వీక్షించి యాత్మలో వగచి
వెఱవకుం డిటమీఁద విను రాముఁ డింక - నెఱి రావణుని నాజి నిర్జించి మిమ్ము
విడిపించు నందఱు వెఱవకుఁ డింకఁ - దడవు లే దని వారిఁ దగ నూఱడించి,
నీడల నందంద నిలిచి యేకాంత - మాడెడువారల నటఁ జేరఁబోయి150
యిది నాకుఁ జొరఁబోలు నిది నాకుఁ బోల - దిది నాకుఁ జొరవచ్చు నిది నాకు రాదు
అనక లంకాపుర మంతయు వెదకి - మనుజవేషముతోడ మగువ నెబ్భంగి