పుట:Ranganatha Ramayanamu.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యెన్నఁడు నొప్పించు నిల నదిమొదలు - క్రన్నన రాక్షసక్షయ మగు ననుచుఁ;
గాన నీతలఁచిన కార్యసంసిద్ధు - లౌ" నంచు దీవించి యాయింతి చనియెఁ.
దనమది మారుతి దానిమాటలకు - ననువొంద నుబ్బి మిన్నంది పెల్లార్చి60
చెడవలె రాక్షసుల్ శీఘ్రం బటంచు - నెడమకా ల్మున్నుగా నిల నడుగిడుచుఁ
గడుసూక్ష్మరూపంబు గైకొని పోయి - యడరుకోటలు దాఁటి యడలక పేర్చి
వడి కోటవాకిలివారు తలార్లు - పొడగానకుండ నప్పుడు గూఢవృత్తి
వీథులు పరికించి విపణిమార్గములు - శోధించి రచ్చలు సొరిది నీక్షించి
ఘనగోపురము లెక్కి గజశాల లరసి - మునుమిడి వరహర్మ్యముల సంచరించి
దేవాలయంబులు తిరిగి యిల్లిల్లు - భావించి గొందులు పరికించి చూచి
యుప్పరిగెలు గాంచి యోసరు ల్నెమకి - చప్పరంబులు డాసి సౌధము ల్వెదకి
చాలఁజెన్నగు రథశాలలు వాజి - శాలలు శస్త్రాస్త్రశాలలుఁ దడవి
మాడువు ల్పరికించి మణిమయం బైన - మేడల వాడల మిగులఁ జెన్నైన
మంత్రులయిండ్లు సామంతులయిండ్లు - తంత్రిపాలురయిండ్లు దైవజ్ఞులిండ్లు70
నావిభీషణుగేహ మతికాయుగృహము - దేవకాంతునియిల్లు త్రిశిరుమందిరము
గంభీరమగు కుంభకర్ణునినెలవు - కుంభునాలయము నికుంభుసద్మంబు
శ్రీమించు నయ్యింద్రజిత్తునినగరు - నామహోదరుగేహ మాదిగా నయిన
దనుజనాథు లనికేతనపంక్తు లచటఁ - గనుఁగొంచు నద్భుతక్రాంతుఁడై వారి
యంతఃపురంబుల నంతయు వెదకి - కాంతాజనంబులఁ గలయంగ నరసి
వెండియు దనుజులవేశ్మముల్ గలయ - నొండొండఁ గనుఁగొంచు నొక్కొక్కచోట
నొకకన్ను నొకచెవి యొకకేలు గలుగు! - వికృతవేషులఁ జూచి వెఱుగుఁ బొందుచును
బహుపాదబహుభుజబహుమస్తకోరు- సహితులఁ గొందఱ సారెఁ గన్గొనుచు
జపతపస్స్వాధ్యాయసత్కర్మనిష్ఠఁ - దపసులౌ దానవోత్తములఁ జూచుచును
మకరతోరణబద్ధమాల్యజాలములఁ - బ్రకటితధూపసౌరభవిశేషముల80
రత్నముక్తాఫలరంగవల్లికల - నూత్నేందుకాంతబంధురవితర్దికల
మణిగణహాటకమయకవాటముల - గణనాధికోగ్రవిష్కంభసూత్రముల
స్ఫుటవజ్రకలితకపోతమాలికల - ఘటితేంద్రనీలప్రకాశదేహళుల
మరకతస్థగితనిర్మలగవాక్షములఁ - గురువిందసందీప్తకుట్టిమస్థలుల
మహనీయతరవిద్రుమస్తంభతతుల - బహుశిరోగృహముల భవనపాళికల
నాయుధోజ్జ్వలహస్తులైన రాక్షసులఁ - బాయక యేప్రొద్దు బలసినయట్టి
వరాణునగరు చేరఁగఁబోయి యచటఁ - గావలివారలఁ గలయ శోధించి
పెక్కువాకిండ్లు నిర్భీతిమైఁ గడచి - యక్కొల్వుకూటంటు లన్నియు వెదకి
యంతఃపురము చేరనరుగునావేళఁ - గంతునిమామ సత్కళలకు సీమ