పుట:Ranganatha Ramayanamu.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కని తిరస్కారంబుగాఁ దలపోసి - యన లేని పొడవైన యామేనితోడఁ
బగటున నీపురిఁ బగలు చొచ్చినను - బగ తాను రాక్షసభటులకు నాకు
జానకిఁ బొడగానఁజాల నే నట్లు - కాన సూక్ష్మాకృతిఁ గైకొని పోయి
యీలంక దైత్యుల నెల్ల వంచించి - వాలాయమునఁ గాంతు వైదేహి ననుచు30
మదిలోన సూర్యాస్తమయ మొప్పఁ దలచి - పదిలుఁడై యెంతయుఁ బరికింపుచుండ
నవిరళసత్త్వుఁడై యఖిలేశుదేవి - నవనీతనూభవ నరసి పో వచ్చి
నే నున్న ననువుగా దీలంక చొరఁగ - వీనికి నన్నట్లు వెసఁ గ్రుంకె నినుఁడు
అనిలనందనునకు నస మిచ్చి దైత్య - ఘనపాపములు పూని కలఁగొనఁ బర్వె
ననఁ బర్వెఁ గలయ ఘోరాంధకారంబు - ఘనమైన దైత్యుల కలకలం బణఁగె
నంత నాకలకలం బణఁగుట నాత్మ - నంతయుఁ బరికించి యనిలనందనుఁడు
మనమున రఘురాము మఱువక నిలిపి - తనతండ్రి వాయువుఁ దప్పక వేఁడి
మార్జాలమాత్రుఁడై మఱి లంకఁ జొచ్చి - కర్జ మూహింపుచు ఘనుల రాఘవులఁ
దలఁచుచు మెలఁగ నత్తఱి విస్మయముగఁ - గలితభయంకరాకారంబుతోడ
బెన్నిధి సాధింపఁ బ్రీతిమై నరుగు - చున్న సాధకునకు నొగి నడ్డపడఁగ40

హనుమంతుఁడు లంకాపురిఁ జొచ్చి సీతను వెదకుట

వడి మహాభూతంబు వచ్చుచందమున - నడరి లంకిణి వచ్చి యడ్డమై నిలిచి
యట్టహాసము చేసి యనిలనందనుని - ధట్టించి పలికెఁ గ్రోధంబు రెట్టింప
"నీ వెవ్వఁడవు? మఱి నీకుఁ బే రేమి? - నీ వీపురంబులోనికి వచ్చు టెట్లు?
ఎవ్వరు పంచినా? రెఱిఁగింపు" మనిన - నవ్వాయునందనుం డచలుఁడై పలికె.
"నీ వెవ్వతెవు? మఱి నీకుఁ బే రేమి? - నీ వేల యడ్డమై నిలిచితి నాకు?
మున్ను నీ వెఱిఁగింపు ముదిత యావెనుక - నున్నట్లు నాతెఱం గొప్పఁ జెప్పెదను.”
అని పల్క “నేను దశాననునాజ్ఞఁ - బనిఁ బూని యీపురి బలిమి రక్షింతుఁ
బేరు లంకిణి యండ్రు; పెఱవారిఁ గన్న - బోరనఁ బొరిగొందుఁ బోనీక" యనిన
హనుమంతుఁ డయ్యింతి కనియె వెండియును - “వనిత! యీపురిఁ జూచువాఁడనై యేను
జనుదెంచితిని వేగ చనఁగ ని”మ్మనినఁ - గనలుచుఁ గోపంబు కఱుకురక్కసియు50
"నెక్కడఁ బోయెద? వింక నాచేతఁ - జిక్కితిగా!" కంచు చెలఁగి మైఁ బెంచి
“కఱకఱి నినుఁ బట్టి కదిసి నీమేను - దఱిగి నీరక్తము ల్ద్రావుదు” ననుచుఁ
గడుకోప మెసఁగ నక్కపినాథుఱొమ్ము - పొడిచిన పొలఁతిఁ జంపుట పాప మనుచు
దడయక మారుతి దానివక్షంబు - పిడికిటఁ బొడిచిన పెంపెల్లఁ బొలిసి
యిలఁ గూలి మిక్కిలి హీనస్వరమునఁ - బలుమాఱు హనుమంతుఁ బ్రార్థించి పలికెఁ.
"గపికులోత్తమ! నన్నుఁ గరుణింపవయ్య! - నిపుణుఁడై మీపురి నిర్మించునాఁడు
వనజాసనుఁడు నాకు వర మిచ్చినాఁడు - వనచరుఁ డొక్కఁడు వచ్చి ని న్నెదిరి