పుట:Ranganatha Ramayanamu.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు

శ్రీరంగనాథరామాయణము

సుందరకాండము



శ్రీరాముకార్యంబు సేయంగఁ బూని - వారిధి పిల్లకాల్వయుఁ బోలె దాఁటి
చారుశృంగంబుల సానుదేశముల - భూరిభూరుహలతాపుంజకుంజములఁ
గలిమిచే నొప్పు లంకాసమీపమున - వెలయు సువేలాద్రి వేడ్కమై నెక్కి
యంత నాహనుమంతుఁ డాయద్రిమీద - నెంతయుఁ గడఁకతో నేపు మై నిలిచి
యట దక్షిణము చూచి యప్పు డిట్లనియె - నటఁ ద్రికూటాద్రిపై నమరెడుదాని
గదలక ధర్మార్థకామము ల్మూఁడు - పొదిగొన్న సిరివోలెఁ బొలుపొందుదాని
నమరావతీపురం బబ్ధిమధ్యమునఁ - గమనీయగతి నొప్పు గలిగినదాని
నలక కుబేరుతో నలుక మై నచట - నెలకొన్నకైవడి నెగడెడుదానిఁ
గలకాలమును నధోగతి నుండలేక - తెలివి మై భోగవతీనగరంబు
జలరాశి వెలువడి సరి త్రికూటమున - వెలసినకైవడి విలసిల్లుదాని10
నంబుధి యావరణాంబువు ల్గాఁగఁ - బండినప్రభ నొప్పు బంగారుకోట
బ్రహ్మాండవిధముగాఁ బరికింప నొప్పు - బ్రహ్మాద్యభేద్యమై పరఁగెడుదాని
మొనసి లోకములకు మొన యొక్కు డగుచుఁ - ననుపమాకృతితోడ నమరెడుదాని
బొలుపొంద బహుదివ్యభోగసంపదల - నలి మీఱ నెక్కుడై యందంద వెలుఁగ
నలినసంభవుగేహ మన నొప్పునట్టి - లలితమై యొప్పెడు లంకాపురంబు
కని చాల వెఱగంది కనురెప్పఁ బెట్ట - కనిలతనూభవుం డందందఁ జూచి
యెల్లలోకంబులు నెక్కట గెలిచి - బల్లిదుఁడై పేర్చు పంక్తికంధరుఁడు
ఇట్టిసంపదలచే నెనయు నీలంకఁ - బట్టాభిషిక్తుఁడై బ్రదికి పాలేది
సకలేశుఁ డగు రామచంద్రునిదేవి - వికలుఁడై కొని వచ్చి వీఁ డేల పొలిసె?
నని వాని దూషించి యాలంక చొరఁగ - ననుపు విచారించి యాసత్వధనుఁడు20
తగ లంకయుత్తరద్వారంబుఁ జేరి - తగవును నీతియుఁ దలపోసి మఱియు
యీసముద్రము కపు లెట్లు దాఁటెదరు? - వాసి దాఁటిన నైన వాసవాదులకు
సాధింప మిగుల నసాధ్య మీలంక - సాధింప నలవియె సకలయత్నముల?
భీమసాహసమునఁ బేర్చు రావణుని - రాముఁ డెట్లు జయించు రణములో నెదిరి
యని ముహూర్తము తనయాత్మఁ జింతించి - మనమున శ్రీరాముమహిమంబుఁ దెలిసి
యీసముద్రం బెంత? యీలంక యెంత? - యీసురారియు నెంత యినకులేశ్వరున