పుట:Ranganatha Ramayanamu.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధరణీశుకార్య మంతయు నెఱవేర్చి - తిరిగి యేతెంచుచోఁ దీర్తు నీకోర్కి
పోయివచ్చెద నంత బొంకు గా” దనిన - నాయింతి కోపించి యటుఁ గ్రమ్మఁబలికె.
“జన నీను నినుఁ బట్టి చంపుదుఁ గాని” - యని నోరు దెఱచిన ననిలనందనుఁడు
తనమేనుఁ బెంచెను దశయోజనంబు - లినుమడిగాఁ బెంచె నింతి యాననము1260
ముప్పదియోజనంబులు పెంచె నాతఁ - డప్పుడు నలువది యదియును బెంచె
నొండొరు లిటు శతయోజనంబులుగ - దండిమైఁ బెంచిరి తనువు వక్త్రములు
నంత నాహనుమంతుఁ డసమానబుద్ధి - మంతుఁడై యంగుష్ఠమాత్రగాత్రమున
నతిసూక్ష్ముఁడై వచ్చి యాయింతివదన - మతిరయంబునఁ జొచ్చి యవలీల వెడలె
“ముడిగొన్న సంసారమోహబంధములు - విడఁదన్ని సుజ్ఞాని వెడలినమాడ్కి
వెడలి నీకోర్కి గావించితి నింక - కడలి దాఁటెద" నన్నఁ గపికులోత్తముని
బుద్ధి కెంతయు మెచ్చి పొగడుచుఁ "గార్య - సిద్ధి నీ కయ్యెడు శీఘ్రంబె" యనుచు
నట దివ్యవనితయై యాయింతి ప్రీతిఁ - బటుసత్త్వు ననిలజుఁ బరఁగ దీవించె.
నతఁ డంతఁ బ్రణమిల్లి యటఁ బోవుచుండ - నతిరయంబున వచ్చి యాతనిఁ గదిసి
యొలసి దేహచ్ఛాయ లొడిసి రాఁ దిగిచి - చెలఁగి జీవుల మ్రింగు సింహిక గదిసి1270
పదియోజనంబుల పరపును నూఱు - పదులయోజనములై పరఁగెడు నిడుపు
నగు మీన మాతని నలమి చేఁ బట్టి - తిగిచి మింగుచునుండ ధీరుఁడై యతఁడు
ప్రతికూలవాతూలపవనసంఘాత - హతుల నోడయుఁ బోలె నటుపోక నిలిచి
యెడద ఛాయగ్రాహి యిది యని తెలిసి - మడవక యటమీఁద మకరివక్త్రంబు
చొచ్చి వత్తు నటంచు సూచించినట్లు - అచ్చెరువంది యింద్రాదులు చూడఁ
గడుసూక్ష్మరూపుఁడై కదలక దాని - కడుపులోపలఁ జొచ్చి కడిమిపై వచ్చి
యాదుష్టరాక్షసి నబ్ధిలో వైచె - నాదట సురలెల్ల నానందమంది
వినుతించి వరపుష్పవృష్టులు గురియ - వననిధి నవలీల వడి దాఁటి పోయి
యాసమీరజుఁ డనాయాసంబుతోడ - నాసువేలాచలం బవలీల నెక్కె.
నని యాంధ్రభాష భాషాధీశవిభుఁడు - వినుతకావ్యాగమవిమలమానసుఁడు1280
పాలితాచారుం డపారధీశరధి - భూలోకనిధి గోనబుద్ధభూవిభుఁడు
తమతండ్రి విట్ఠలధరణిశుపేర - గమనీయగుణధైర్యకనకాద్రిపేర
బని బూని యరిగండభైరవుపేర - ఘనుపేర మీసరగండనిపేర
నాచంద్రతారార్కమై యొప్పు మిగిలి - భూచక్రమున నతిపూజ్యమై వెలయ
నసమానలలితశబ్దార్థసంగతుల - రసికమై చెలువొందు రామాయణంబు
పరఁగు నలంకారభావన ల్నిండఁ - గరమర్థిఁ గిష్కింధకాండంబుఁ జెప్పె.

కిష్కింధాకాండము సంపూర్ణము

————