పుట:Ranganatha Ramayanamu.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దనపతిహితకార్యధైర్యశౌర్యములు - తనవేగలాఘవోదాత్తసత్త్వములు
జూచి యింద్రాదులు సొరిదిఁ గీర్తింప - నీచందమున దాఁటి యేగుచున్నంత
"నీనిత్యకృతి జగద్ధితముగాఁ బూని - పూని యెంతయు దవ్వు పోవుచున్నాఁడు
ఇతనికి విశ్రాంతి యిచటఁ గావించి - యితనిఁ బుచ్చెద" నని యిచ్చలోఁ దలఁచి
యప్పుడు మైనాకు నంబుధి పిలిచి - "యిప్పుడు హనుమంతుఁ డేతెంచె నిటకు
నొప్పార నాతిథ్య మొసఁగు నీ" వనుచుఁ - జెప్పి పొ మ్మనుటయు శీఘ్రంబె యరిగి

హనుమంతునకు మైనాకుఁ డాతిథ్య మొసఁగుట

యురుతరనిజపక్షయుగళసంజాత - మరుదుచ్చలద్వార్ధిమధ్యంబు వెడలి
శ్రీకరకాంచనశృంగసంకలిత - నాకమై యొప్పు మైనాకపర్వతము
ఎదుటఁ దోఁచినఁ జూచి యిది దైత్యమాయ - కదిసి నాపనికి విఘ్నము సేయఁగోరె.1230
దానికి నేమి నాదర్పంబుపేర్మి - దీనిఁ ద్రుంచెదఁ గాక! తెగి యంచు నడరి
వరవజ్రకఠిన మౌ వక్షంబుచేత - నురవడి హనుమంతుఁ డుదరి తాఁకుటయు
గరువలి సుడిఁ గొన్న కారాకువోలెఁ - దిర మేది ధృతి దూలి దిర్దిరఁ దిరిగి
మనుజుఁడై పొడసూపి మైనాకశిఖరి - యనిలనందనుఁ జూచి యర్థితోఁ బలికె.
"అనిలజ! నేను నీ కపకారి గాను - వనరాశిపంపున వచ్చితిఁ గాని
యమ్మహాత్ముఁడు నీకు నాతిథ్య మొసఁగు - పొమ్మన్న వచ్చితిఁ; బూర్వకాలమున .
పర్వతంబుల కెల్ల పక్షము ల్గలిగి - గర్వించి మెలఁగ నాఖండలుం డలిగి
పవిధార నొక్కటఁ బక్షము ల్డునుమఁ - బవనుఁడు మీతండ్రి పరికించి నన్ను
నవలీల నీలవణాంబుధిలోనఁ - గవియించి పక్షము ల్గాచి రక్షించెఁ
గాన మీవాఁడను గాని యన్యుఁడను - గాను; శీతాచలాగ్రణికుమారుండ1240
నేను మైనాకుండ నీవు నాయందుఁ - బూని యీఫలమూలములఁ దృప్తిఁ బొంది
బడలికలును బాసి పవనకుమార! - కడులావు మీఱ లంకాపురంబునకు
నరుగుము నీ” వన్న నమ్మహాబలుఁడు - "వెరవుగా దిప్పుడు విశ్రమించుటకు
జలనిధినడుమ నెచ్చట నిల్వ ననుచుఁ - జెలఁగి మున్ను ప్రతిజ్ఞ జేసినవాఁడ;
నిట రాముకార్యార్థ మేగుచున్నాఁడ;- నటుగాన నిల్వరా దద్రీశ! నాకు”
నని పాణితలమున నయ్యద్రిఁ దడవి - "యనఘాత్మ! నీపూజ లన్నియు వచ్చె,”
నని పల్కి పోవుచో ననిలనందనుని - ఘనశక్తి కమరులు కడుచోద్య మంది
నానావిధముల నానందించి రంత - మైనాకగిరి కింపుమై నాకవిభుఁడు
కనుఁగొని శ్రీరాముకార్యమై యేగు - హనుమంతునకుఁ బ్రియం బాచరించితివి;
యటుగాన నీకు నే నభయ మిచ్చితిని - ఇటు సుఖస్థితి నుండు మీ" వంచుఁ బలికె.1250
నప్పుడు గంధర్వు లమరులు మునులు - తప్పక యంజనాతనయుఁ జూచుచును
ఇతనిలా వెట్టిదో యెఱుఁగుద మనుచుఁ - జతురులై సురస నాఁ జను దేవదూత
బనిచిన రాక్షసభావంబు దాల్చి - యనిలసూనునకుఁ దా నడ్డమై పలికె.
"నీవార్ధిలో నుండి యే నిన్నుఁ గంటి - దైవయత్నంబునఁ దా నింక మంటి
అనిలజ! యాకొంటి నట నిటఁ జనక - మునుకొని నావక్త్రమున వచ్చి చొరుము
నీ" వనవుడు రామనృపుకార్యమునకుఁ - బోవుచున్నాఁడను పొలఁతి! రారాదు