పుట:Ranganatha Ramayanamu.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జలధితీరముఁ జూచి చని మందరాద్రి - నిలయకికారుల నిలయము ల్వెదకి
తివుటమై నట నవద్వీపంబుఁ గడచి - యవల జంబూద్వీప మటమీఁద దాఁటి
చెచ్చెర నటఁ బోయి శీతాద్రి వెదకి - యచ్చోటఁ గాకోల మను మడుఁ గరసి
తనరు లోహితసముద్రము దాఁటి పోయి - చని కూటశాల్మలిచ్ఛాయల నరసి
మఱి వోయి గరుడాశ్రమంబున వెదకి - వరలు గోశృంగపర్వతము శోధించి880
అందలి శృంగంబు లందు వర్తించుచు - మదయుక్తరాక్షసమండలి నరసి
యట దుగ్ధసాగర మవలీలఁ గడచి - యట సుదర్శన మను నద్రిలో వెనకి
వలనొప్ప శుద్ధార్ణవము దాఁటి పోయి - బలువైన జాతరూపశిలాద్రి వెదకి
యందు వేదలలతో నాసీనుఁడైన - యిందువర్ణు ననంతు నీక్షించి మ్రొక్కి
యొగిఁ బదునాల్గువేయోజనంబులకు - మిగిలి యవ్వల నున్న మేరువు వెదకి
యామేరుగిరిచుట్టు నర్కుని కెరఁగి - యామెయి వాలఖిల్యాదుల కెరఁగి
యావల సుడనుదయాద్రియందు శోధించి - రావణునిలయ మారసి వార్తఁ దెండు
రవి లేని యంధకార ముగ్రమ్ముకతన - భువిలోన నవ్వలిభూము లే నెఱుఁగ
నిపుడె నీ వటఁ బోయి నెలలోన రమ్ము - నవమతి రాకున్న నాజ్ఞఁ గావింతు"
నావుడు లక్షవానరులతోఁ గూడ - వేవేగ వినతుండు వెడలెఁ దూర్పునకు.890
నినతనూభవుఁ డంత హితశీలు నీలు - హనుమంతు నంగదు నట జాంబవంతు
గజు గంధమాదను గవయు గవాక్షు - విజయుని మైందుని ద్వివిదుని తారుఁ
దగఁ బిల్చి “మీ రింక దక్షిణంబునకుఁ - దగు వానరులఁ గొంచుఁ దడయక పోయి
యర్మిలి వింధ్యాద్రి యాదిగాఁ దొడరు - నర్మదయు దశార్ణనగరంబు వెదకి
దండకారణ్యంబు తప్పక వెదకి - దండిగా నవల గోదావరి నరసి
వలనొప్ప నట వేత్రవతిలోన వెదకి - నెలకొని కాళింగనిషధదేశముల
నారసి కర్ణాటకాంధ్రచోళేంద్ర - చేరకేరళపాండ్యసీమల నెల్ల
నరసి యమ్మలయాద్రి నరసి కావేరి - నరసి యగస్త్యునియాశ్రమం బరసి
యమ్మహాత్మునిఁ గాంచి యతనియనుజ్ఞ - నెమ్మితోఁ దామ్రపర్ణీనది దాఁటి
జలధివేలావనస్థలముల వెదకి - పొలుపొందు నాహేమపురములో వెదకి900
యెదిరిన కడక మహేంద్రాద్రియందు - వెదకి యవ్వల నున్న వృషభాద్రిఁ జూచి
యావలఁ బుష్పాద్రియందు శోధించి - క్రేవ గుంజర మను గిరిఁ బరీక్షించి
యచటి యగస్త్యుగేహము విశ్వకర్మ - రచితమై తగు నందు రమణి శోధించి
యంజనానది దాఁటి యవ్వల మణుల - రంజిల్లు ఫణులచే రక్షింపఁబడిన
వదలక యాభోగవతిలోన వెదకి - వెదకి యవ్వల నున్న విషమాబ్ధి కరిగి
యందుపై గంధర్వు లప్సర ల్సురలు - నుందు రాచోటుల నోడక వెదకి
తలఁగక యరిగి వైతరణి లంఘించి - పొలుచు వైవస్వతుపురమున కరిగి