పుట:Ranganatha Ramayanamu.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శతబలి హరుఁడును సన్నాథుఁ లనఁగ - నతివీరవరులు వీ రాదిగాఁ గపులు
తమసుతుల్ తమహితుల్ తమసహోదరులు - తమచుట్టములు తాము దట్టమై కూడి
యివి పదు లివి నూఱు లివి వేలు లక్ష - లివి కోటు లవ్వల నివి శతకోటు
అలనరాక పచ్మ మహాపద్మ ఖర్వ - మనఁగఁ బర్వినసంఖ్య లన్నియుఁ గడచి
యెలమి సొంపున నేల యీనినయట్లు - చెలఁగి యేదిక్కు చూచిన వెల్లివిరిసి
యీమెయి కొలఁదిగా కేపు దీపించి - భూమియు నాకసంబును నిండఁ గప్పి850
కర ముగ్రగతిఁ గ్రాలు కాలదండముల - వరుసను దీపించు బాహుదండములు
కెడఁబేర్చు బడబాగ్నికీలలఁ బోలి - వడిఁ బర్వి దివి రాయు వాలపాశములు
పొరిపొరిఁ గాలాభ్రముల కాంతు లనఁగ - నురువడి మైఁగ్రాలు నుగ్రదంష్ట్రములు
అలరెడు ప్రళయకాలాదిత్యబింబ - ములఁ బోలి మండెడు ముఖగహ్వరములు
లోలాబ్ధివిపులకల్లోలఘోషములఁ - బోలి ఘోషించు నార్పులు వెల్లి విరియ
బలములతోఁ గూడ ప్లవగవల్లభులు - కలగొన వచ్చు నగ్గలికలు చూచి
యిచ్చలోపల నప్పు డిక్ష్వాకుకులుఁడు - నచ్చెరువడి చూచి హర్షింపుచుండె.
ఆవేళ సుగ్రీవుఁ డధిపతిఁ జూచి - "దేవ! నాసేన లేతెంచుచందంబు
లవధరించితిరె? వీరలం దొక్కరొకరు - తివిరి మీపనులు సాధింప నోపుదురు."
అని చెప్పి వారల యలవుల పేళ్లు - జననముల్ జాతులు సత్వసంపదలు860
తనువులు వర్ణము ల్తగు భోజనంబు - లును కులదేశంబు లోలి వర్ణించి
"బడబాగ్నిముఖమునఁ బడియున్నవైనఁ - గడువేగఁ జని యుగ్రగతి యొప్పు మిగిలి
వడఁ బేర్చి యార్చి దుర్వారులై కదిసి - పుడమియు నభము నబ్ధులు చొచ్చియైన
నట మృత్యువక్త్రంబునం దున్నవైన - నెట నందుఁ బోరాని యెందున్న వైన
నావానరాధీశులం దొక్క రొకరు - దేవి నీదేవి వైదేహిఁ దెచ్చెదరు.
ఆనతి యి"మ్మన్న నర్కజుఁ దిగిచి - భూనాథుఁ డాదరంబునఁ గౌఁగిలించి
“బలసంపదలయందు భానుజ! నీకుఁ - దలపోయ మఱి యసాధ్యము లెందుఁ గలవు?
పూని నీపౌరుషంబులు చూచి కాక - యేనేలఁ గైకొందు నిటఁ గ్రిందు నిన్ను"
అని పల్కి “వైదేహి నరసిరాఁ బనుపు" - మనవుడు హర్షించి యర్కనందనుఁడు

వానరవీరుల సీతను వెదకఁ బంపుట

ఒనర నుత్తమమైన యొకలగ్నమందు - వినతుఁ డన్వానరవీరునిఁ బిలిచి870
"యేవంక నెచ్చోట నెందు నేమఱక - నీవు సేనలఁ గూడి నెఱిఁ దూర్పు నడచి
యామహీతనయ నయ్యమునలో వెదకి - యామినీగిరిఁ జూచి యటమీఁదఁ బోయి
సురనదిలోఁ జూచి శోణనదంబు - కరమర్థి నరసి యాకౌశికి వెదకి
యల సరస్వతిఁ జూచి యట సింధు వరసి - పొలుచుపౌండ్రవిదేహభూములు వెదకి
మాళవ కోసల మాగధ బ్రహ్మ - మాలాఖ్యశైలంబు మైథిలి నరసి