పుట:Ranganatha Ramayanamu.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నైనను రఘురాము నతిభక్తిఁ గొలిచి - యేను కీర్తులకెల్ల నెక్కుడై పొలుతు.”
నని పల్కి హనుమంతు నతినీతిమంతుఁ - గనుఁగొని "మనవీటఁ గల కపికోటి
చాటించి వెడలింపు సమకట్టి కపులఁ - బాటించి యెడసేయఁ బాడి గా దింక
మన మిప్పు డారామమనుజేశుఁ గానఁ - జనవలె" నని పల్కి సంభ్రమం బెనఁగఁ
దరణినందనుఁ డంత తారాదిసతుల - వెరవొప్ప నప్పుడు వీడ్కొని వచ్చి
కలయ దిక్కుల నున్న కపిముఖ్యపతుల - బలములఁ బిలుపించి పయనంబు చేసి
మేదినీభాగంబు మిన్నును దిశలు - భేదిల్లఁ బ్రస్థానభేరి వేయించి
ప్రబలకాంచనరత్నరమ్య మౌ యొక్క - శిబికపై లక్షణుఁ జెలిమి నెక్కించి820
చామరద్వయసితచ్ఛత్రచిహ్నములు - నామహాత్మునిమ్రోల నరుగ నేమించి
సబలుఁడై తానును సౌమిత్రి వెనుక - శిబిక యొక్కటి యెక్కి చిత్రవైఖరిని
ముందుగా శుభతూర్యములు భోరుకలుగ - గ్రందుగా వందిమాగధనుతు ల్చెలఁగ
నెడ నెడఁ గపినాథు లేతెంచి తన్నుఁ - బొడఁగన నుడుగణస్ఫురితేందుపగిది
సకలవానరవీరసైన్యసన్నాహ - మకలంకమై యొప్ప నప్పుడే కదలి
యరుదైన పేర్మితో నవని గంపింపఁ - గరము సొంపెక్కి లక్ష్మణుఁ గొల్చి నడచె.
అట మాల్యవంతంబునం దున్న రాముఁ - డట మ్రోయు కలకలం బప్పు డాలించి
యవె వచ్చెఁ గపిసేన లని కోప ముడిగి - రవితనూజునిమీఁద రాగిల్లుచుండె.
అందమై మణికాంచనాంచితంబైన - యాందోళికాద్వయం బల్లంత డిగ్గి
తామరసాప్తనందనుఁడు సంప్రీతి - సౌమిత్రియును దానుఁ జనుదెంచి మ్రొక్కి830
యవిరళం బగు భక్తి హస్తముల్ మొగిచి - యవనివల్లభున కి ట్లనియె నర్కజుఁడు.
"దేవ! సేనలఁ బిల్వ దెసలకుఁ బంపి - వావిరి నివి గూడి వచ్చునందాఁక
దండెత్తి యిటకు రాఁ దడసితిఁ గాని - యొండొకవెంటమై యున్నాఁడఁ గాను”
అనిన నర్కజు రాముఁ డతికృపాదృష్టి - గనుఁగొని మన్నించెఁ గడఁకతో నంతఁ
గైలాసగిరియందుఁ గనకాద్రియందు - నీలాచలమునందు నిషధాద్రియందు
ద్రోణాచలమునందుఁ దుహినాద్రియందు - శోణాచలమునందు సోమాద్రియందు
వృషభాచలమునందు వింధ్యాద్రియందు - ఋషభాచలమునందు ఋక్షాద్రియందుఁ
బారియాత్రమునందుఁ బ్రాగ్గిరియందుఁ - ఆరత్నగిరియందు నస్తాద్రియందు
మలయాచలమునందు మంథాద్రియందు - గలగొని వర్తించు ఘనబాహుబలులు
పవమానసూనుండు పనసుఁ డంగదుఁడు - గవయుండు నీలుండు గంధమాదనుఁడు840
పావకాక్షుఁడు కాలపాశుఁ డుగ్రధనుఁ - డావేగదర్శియు నగ్గవాక్షుండు
నలుఁడు మైందుఁడు మహానాథుండు ధూమ్రుఁ - డలఘుండు జంఘాళి యగ్గిరిభేది
సుముఖుండు కేసరి జ్యోతిర్ముఖుండు - విముఖుండు తారుండు వినతుండు గజుఁడు
జాంబవంతుండును సంపాతి రంభుఁ - డంబురాశితనూజుఁ డగు సుషేణుండు