పుట:Ranganatha Ramayanamu.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యందు నాసమవర్తియనుమతి వడసి - పొందుగాఁ బితృలోకమును గలయంగ
వెదకి సీతాదేవివృత్తాంత మరసి - పదిలులై నెలలోన ప్రతివార్తఁ దెండు.
ఆవల “నంధకారావృతం బగుట - దేవతలకు నైనఁ దీఱ దం దరుగ”910
ననిన నాకపినాథు లందఱుఁ గూడి - యనుమోదరసవార్ధియందు నోలాడి
దిననాథతేజుఁడై దీపించు రామ - జననాథుతో తమసత్త్వము ల్మెఱసి
"జానకి నెబ్భంగి సాధించి కాని - మానవేశ్వర! రిత్త మగిడి రా మేము”
అని పల్క రాముఁ డాహనుమంతుఁ జూచి - యనువుగా భావికార్యము నిశ్చయించి.

శ్రీరాములు హనుమంతునిచేత తనముద్రిక నిచ్చుట

తనదయాదృష్టి యాతనిమీఁద నుంచి - "యనిలజ! యిందు రమ్మని చేరఁబిలిచి,
జనకజఁ గనుఁగొనఁజాలుదు వీవె - యనఘ! నీచేతఁ గార్యము నిర్వహించు
నీ వంతవాఁడవు నీబాహుబలము - భావింప నట్టిదె పవమానతనయ!
యిదె నాదు ముద్రిక యిది సీత కిచ్చి - సుదతిచిత్తములోని శోకంబు మాన్పి
సీతకు మే మున్న సేమంబు చెప్పి - సీతసేమముఁ గొంచు శీఘ్రంబె రమ్ము;"
అని ముద్రి కిచ్చిన ననిలనందనుఁడు - తనమస్తకంబున ధరియించి మించెఁ920
దనరార నుదయాద్రి తనదుశృంగమున - దినమణిఁ దాల్చి యెంతే నొప్పుకరణి
నంత నాహనుమంతుఁ డానంద మంది - గంతులు వేయుచుఁ గరములు మొగిచి
“యినకులాధీశ్వర! యెంతద వ్వైనఁ - జని సీతయున్నెడ సాధించి వత్తు
సోమసూర్యులఁ బట్టి శోధించి యైన - భూమియు నభము నబ్ధులఁ జొచ్చి యైన
నామహీసుత నింక నారసి వత్తు - నీమహిలోపల నెచ్చట నున్న
నసమాన మగు సత్త్వ మభినుతి కెక్క - వసుధేశ! రావణువాసంబుఁ జొత్తు
నరిగేద" నని మ్రొక్కి యట దక్షిణమున - కరిగె వాయుజుఁ డంగదాదులతోడ.
మఱి సుషేణునిఁ బిల్చి మర్కటేశ్వరుఁడు - “వఱల నీ వొకలక్షవానరు ల్గొలువ
సౌరాష్ట్రదేశంబు చని చొచ్చి వెదకి - ధీరులై బాహ్లికదేశంబు నరసి
శ్రీకరమై యొప్పు సింధుసౌవీర - కేకయదేశము ల్కృతిమతి వెదకి930
వలనొప్పఁ బున్నాగవనములో నరసి - తెలిసి పశ్చిమవార్ధి దృష్టించి చూచి
నలి నారికేళవనంబు శోధించి - యలయక పోయి వజ్రాద్రి శోధించి
పారియాత్రనగంబు పరికించి యచటఁ - గూరిమి గంధర్వకోటులఁ దెలిసి
బలియు హయగ్రీవు పంచజనాఖ్యు - గలన ఖండించి శంఖంబు చక్రంబు
చక్రి యచ్చో దొలి జతఁ గాంచినట్టి - చక్రవంతాద్రిని జెచ్చెర వెదకి
తరణి యెచ్చోట నస్తము గాంచు నట్టి - చరమాద్రి నీక్షించి సౌవర్ణి నరసి
వెలయంగ నెనుబదివేలసంయములు - గల కాంచనాద్రులఁ గలయ వీక్షించి
చరితార్థుఁ డగు మేరుసావర్ణిమౌనిఁ - బరికించి నెలలోనఁ బ్రతివార్తఁ దెండు