పుట:Ranganatha Ramayanamu.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నా నిని యారవినందనుం డట్ల - రావింపఁ బంచిన రామానుజుండు
భర్మగోపురహర్మ్యపటలంబు విశ్వ - కర్మనిర్మితచిత్రకరకౌశలంబు
కైలాసశైలసంకాశసౌధంబు - కేళీసరోవరాంకితవనాంతరము
దేవగంధర్వావతీర్ణప్లవంగ - సేవితాగ్రంబు కిష్కింధపురంబు
చొచ్చి యచ్చోట నిస్తులవస్తుమహిమ - కచ్చెరువందుచు నటఁ బోయి పోయి
ఇంద్రుగేహముతోడ నెనయైన వాన - రేంద్రుగేహము సొచ్చి హెచ్చినకినుక
నచ్చరకొమరల నందచందములు - మెచ్చని మెలఁతల మిసిమిపాటలను
వారి వీణావేణువాద్యమృదంగ - భూరిభూషణరవస్ఫూర్తియు వినుచు
నంతకాకారుఁడై యతికోపుఁ డగుచు - నంతఃపురద్వార మటు చేరి నిలువ790
నా రాక విని యొంటిఁ దా రాక యపుడు - తారాసమేతుఁడై తడయక వచ్చి
యతనికోపంబును నతనిరూపంబు - నతిభీతిఁ గనుఁగొంచు నర్కనందనుఁడు
అలరెడుభక్తిమై నడుగుల కెరఁగి - వలయునర్చనము లీవచ్చినఁ జూచి
"యోరి! రామద్రోహి! యోరి! కృతఘ్న! - యోరి! నీయర్చన లుచితమే నాకు?
జానకీపతితోడ సత్యాత్ముతోడ - వానకాలముఁ బుచ్చి వచ్చెద నంటి
రావైతి తప్పితి రఘురామునాజ్ఞ - భావింపలే వైతి పరిశుద్ధి వైతి
వాలిఁ జంపిన రామవసుధేశుశరము - కాలాగ్నికణములు గ్రక్కుచున్నదియు
నిను నీఱు సేయక నిలుచునే యింక - వనచరాధమ! వెఱ్ఱివాఁడవై చెడితి”
ననిన తారాదేవి యతిభీతిఁ బొంది - "యనఘ! మీదాసుఁ డీయర్కనందనుఁడు
ఈరాజ్యసంపద లీభోగకోటు - లారయ మీ రిచ్చినవియె యీతనికి;800
మీరు పెట్టినచెట్టు మిహిరనందనుఁడు - వైరంబునకు నెంతవాఁడు మీ కతఁడు?
రణవిశారదుఁడైన రామునియాజ్ఞ - గణుతింపకున్నాఁడు గా యర్కసుతుఁడు,
పొలుపొందఁ గార్తిక పున్నమనాఁటి - కిలఁమీఁదఁ గపిసేన నెల్లను గూర్పఁ
బడవాలు నీలునిఁ బంచి తాఁ బోదు - నడరెడు ప్రేమతో నని యున్నవాఁడు
గాఁడు రామద్రోహి గాఁ డసత్యుండు - గాఁడు కృతఘ్నుండు గాన మీ రితనిఁ

లక్ష్మణుఁడు సుగ్రీవుని మన్నించుట

గరుణింపు" మనవుడు కలుషంబు దక్కి - నరనాథసుతుఁ డర్చనములు గైకొనియె.
గైకొన్నపిమ్మటఁ గనకపీఠమున - రాకొమారుని నుంచి రవితనూభవుఁడు
తదనుజ్ఞఁ గైకొని తాను గూర్చుండి - మృదుమధురోక్తుల ముద మొప్పఁ బలికెఁ.
"సౌమిత్రి! రాఘవ! స్వామికార్యంబు - నే మఱతునె? యిపు డెల్లవానరులఁ
దెచ్చెద వైదేహి దిక్కుల వెదుకఁ - బుచ్చెద వచ్చెదఁ బొండు మీవెనుక810
నేశరంబున వాలి యిలమీఁద వ్రాలె - నేశరంబునఁ గూలె నేడుతాళములు
నాశరంబే చాలు నఖిలదానవుల - నాశంబు నొందింప నాతి సాధింప