పుట:Ranganatha Ramayanamu.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తారతో రతికేళిఁ దగిలి యున్నాఁడొ? - యారాజ్యమున మత్తుఁడై యున్నవాఁడొ
కాకున్న మత్కార్యగతులు భావింపఁ - డీ కృతఘ్నత కోర్చి యేటికిఁ దడయ?
మతి నుపకారంబు మఱచినవాఁడు - ప్రతిన దప్పినవాఁడు పాడిమై తనదు
చెలికానికార్యంబు సేయనివాఁడు - తలపోయ మానవాధముఁ డండ్రు బుధులు.
అలవుమై నటఁ బోయి యర్కజుఁ బిలువు - పిలిచిన రానని బిరు దాడెనేని?

లక్ష్మణుఁడు కిష్కింధకుఁ బోవుట

యని వాలిఁ జంపిన య మ్మెందు బోయె - నని రమ్ము పొ"మ్మన్న నన్నకు మ్రొక్కి
కనుఁగవఁ బ్రళయాగ్నికణములు దొఱుఁగ - ఘనశరచాపముల్ గైకొని వెడలె.
నేల యల్లలనాఁడ నిడుజంగ లిడుచు - గాలివేగమున వృక్షములెల్లఁ గూల
కృతమతి నటఁబోయి కిష్కింధఁ జేరి యతిభీతులై కపు లందందఁ బరఁగ
నాపురద్వారస్థులగు కపు లప్పు - డే పఱతెంచి వీఁ డెవ్వఁడో యనుచుఁ760
గోట వాకిళ్లు గ్రక్కున నేసి ప్లవగ - కోటి గావలి పెట్టి కోరి యత్తెఱఁగు
వడి రాజు కెఱిగింపవలెనని వారు - కడుభీతులై పాఱి కరములు మొగిచి
వడి తార పరిచారవనితలతోడఁ - దడయ కాచంద మంతయుఁ దెల్ప వారు
ఇది వేళ గా దన్న నెలమి నంగదుని - గదిసి సాగిరి మ్రొక్కి కరములు మొగిచి
"వినవయ్య! యువరాజ! విఖ్యాతతేజ! - మనవీటివాకిట మౌనివేషంబు
గనుపడ జడలు వల్కలములు దాల్చి - తనకేల బాణకోదండము ల్పూని
యొకఁ డంతకునిఁ బోలి యున్నాఁడు వచ్చి- యకలంకసత్వుఁడై " యనిన నంగదుఁడు
నారాముననుజన్ముఁ డని నిశ్చయించి - తారాతనూజుఁడు తడయక వచ్చి
సౌమిత్రి పొడఁగన్న చండకోపమున - దామరసాప్తనందనున కంగదుఁడు
నారాక చెపు మన నతఁడును బోయి - మారవికారాబ్ధిమగ్నుఁడై మిగుల770
గారవంబునఁ జేరి కరపల్లవములు - నారుమసతి యంఘ్రు లల్లనఁ బిసుక
తారామృదూరులు తలగడ గాఁగ - నూరక సుఖియించుచున్నసుగ్రీవుఁ
గనుఁగొని “వాఁడె లక్ష్మణుఁ డున్నవాఁడు - మనవీటివాకిట మండుచు" ననిన
మది సంశయించుడు మంత్రులఁ బిలిచి - "యిది యేమి? సౌమిత్రి! హితమైత్రి దప్పి
యీరీతి వచ్చుట కేమి కారణము? - నేరము నావల్ల నెమకిన లేదు;”
అని వితర్కింపఁగా నాంజనేయుండు - దిననాథసుతుతోడఁ దెలియని ట్లనియె.
“ఆమహేంద్రకుమారు ననిఁ గూల్చి నీకు - నీమాడ్కి కపిరాజ్య మిచ్చినయట్టి
రామునికార్య మారడివుచ్చి యిట్లు - కామోపభోగసౌఖ్యంబులఁ బొదలి
యుందురే? యందుకై యుగ్రభావమున - సందేహ మేటికి సౌమిత్రి! యిటకు
వచ్చినాఁ డమ్మేటి వాకిట నుండ - వచ్చునే లోకైకవంద్యుఁ డాఘనుఁడు780
రావింపు సేవింపు రాముకార్యంబు - గావింపు భావింపు కడఁగి నీ ప్రతిన”