పుట:Ranganatha Ramayanamu.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బొగడుచందమున నద్భుతవృత్తిభేద - మనుచు మండూకంబు లఱచె నందంద.
వలయమేఘములు ప్రావృడ్వధూమణికిఁ - గలయ మైఁ బూసిన కస్తూరి యనఁగ720
ధరణి నెల్లెడలను దనువు సొంపెక్కి - పరఁగ నీలచ్ఛాయ పంక మొప్పారు
వారాశి నొడఁగూడి వల నేది రాము - ఘోరబాణాగ్నిఁ గ్రాగుట విచారించి
చఱచి పో వెఱచిన చాడ్పున వరద - లఱిముఱిఁ జెఱువుల నందంద నిలిచె.
లోకకంటకదైత్యు లోఁబెట్టుకొంటిఁ - గాకుత్స్థుఁ డిదె నిన్ను ఖండించు ననుచు
సుడిఁబడి మొఱపెట్టుచును భానుకరణి - వడి మ్రోయుచును జొచ్చె వారి పెన్నదుల.
నంత వానలు వెల్చె నవనిపై నపుడు - నంతంత దివి నున్న యభ్రము ల్విరిసెఁ
దెలివొంది కిరణము న్దిశ లెల్ల నిండెఁ - జెలువొంద రవి ప్రకాశించె లోకముల
ధరణి నిష్పంకమై తనరె నెంతయును - గరమొప్ప గొలఁకులఁ గమలంబు లమరె.
గూలము ల్మదకరుల్ గ్రుచ్చి గోరాడె - రేలు నక్షత్రచంద్రికలు పెంపారె
వచ్చె నంచలు సరోవనికిఁ గాపురము - మెచ్చెఁ దామరతూండ్లు మెలఁత లుల్లమున730
చెఱుకు రాజనమును చేనులపంట - తఱు చయ్యె వృషభయూథము రంకె వ్రేసె.
గలక నంతయుఁ బాసి కనుపట్టె జలము - ఇలఁ దెరువరులకు నిచ్చె సౌఖ్యంబు.
చదల నిర్మలములై జలదంబు లొప్పె - నదు లెల్ల నింకి కాల్నడలయ్యె నంత.
అటమున్నె హనుమంతుఁ డర్కజుఁ గదిసి - "యిట శారదాగమం బేతెంచె నింక
శ్రీరాముకార్యంబు సేయంగవలయు - వారు వీరన కెల్ల వానరాధిపుల
రప్పింపు" మనవుడు రవిసూనుఁ డలరి - యప్పుడే పడవాలుఁడగు నీలుఁ బిలచి
“వివిధపర్వతసరిద్ద్వీపాధిపతుల - ప్లవగగోలాంగూలభల్లూకపతుల
రావింపు మొకఁ డైన రాకున్న నాజ్ఞ - కావింపు" మని యచ్చెఁ గడఁకమై నిచట
తముఁడు చెయ్యూత తనతాల్మి కొసఁగ - క్రమ్మినవగ వానకాలంబు గడపి
రామభూవరుఁడు శరత్కాల మైనఁ - గోమలిఁ జింతించి కోర్కులు మెదలి740
మదనాతురుండునై మదిఁ జాల భ్రమసి - యుదయాద్రిపై నున్న యుడురాజుఁ జూచి
“యిది యేమి యుత్పాత? మిది యేమి చంద? - మిది యేమి యీరాత్రి యినుఁ డేల పొడిచె?
నామేనితాప మిన్మడి గాఁగఁ జొచ్చె - సౌమిత్రి! నను తరుచ్ఛాయలఁ జేర్చు"
మనినఁ “జంద్రుఁడు గాని యర్కుండు గాఁడు - జననాథ! హరిణలాంఛన మదె చూడు.”
మని లక్ష్మణుఁడు పల్క హరిణాక్షి పోయె - నని సీతఁ బేర్కొని యతిమూర్ఛఁ బోవ
దశరథాత్మజునకుఁ దమ్ముఁ డాలోన- శిశిరోపచారము ల్చేసి తేర్చుటయు
మఱి వివేకము లూని మనుజవల్లభుఁడు - "తఱి లంకపై నింక దండెత్తవలయు
సౌమిత్రి! చూచితె జలజాప్రసూనుఁ - డేమని భాషించె నే మని పోయె?
వానకాలముఁ బుచ్చి వచ్చెద ననియె - వానకాలము వోయె వచ్చుట లేదు
ఒదవి నాచేసిన యువకార మెల్ల - మదిలోన మఱచి యున్మత్తుఁ డై వాఁడు.750