పుట:Ranganatha Ramayanamu.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నసమానరూపవిలాస మెన్నుచును - అసమానశోకార్తుఁ డై యుండె నంత.
ధరణిజ నెడఁబాసి తలఁకెడురాముఁ - బొరిపొరి దుఃఖము ల్పొదువుచందమున
నఱిముఱి దివినుండి యంబుజమిత్రు - మెఱయనీ కందంద మేఘము ల్వొడమె.
రావణురాజ్యంబు రఘురాముచేత - నీవిధి చలియించు నింక నన్పగిది690
నొలసి యొండొండ విద్యున్నికాయములు - జలదంబులందుండి చలియింపఁదొడఁగెఁ
గైకొని యింక నిక్ష్వాకులవల్లభుఁడు - నాకారిపై దండు నడుచుచున్నాఁడు
అని సురలకుఁ జెప్ప నరిగెనో ధాత్రి - యన వాయువులఁ దోడ నట ధూళి యెసఁగె.
నాలంబులో దైత్యు నణఁగింపు మనుచుఁ - గాలుఁడు తనచేతికాలదండంబుఁ
బొనర రాముని కిచ్చి పుత్తెంచె ననఁగఁ - దనరార దివి నింద్రధను వొప్పెఁ జూడ.
నమరులు రామునకై దండు వెడలఁ - గొమరార భేరులు ఘోషించుపగిది
నున్నతధ్వనులతో నొండొండఁ బర్వి - మిన్నెల్ల భేదిల్ల మేఘంబు లుఱిమె.
నలరుప్రావృట్కాల మఘపురుషుండు - లలిమీఁద నాకాశలక్ష్మితోఁ గదియ
నొగి సరు ల్దెగి రాలుచున్న ముత్యముల - పగిదిఁ దొల్చినుకులు పడియె నందంద.
యగపడి చెఱవోయె నని కూఁతుఁ దలఁచి - వగచి నిట్టూర్పులు వడిఁ బుచ్చుకరణి700
వెఱవున లావులు వెడలె నందంద - ధరణి నెల్లెడల నుదగ్రంబు లగుచుఁ
జనుదెంచి రామలక్ష్మణపయోదములఁ - గనుఁగొని సురచాతకము లుబ్బుపగిది
గనుఁగొనఁ బర్వెడు ఘనపయోదములఁ - గనుఁగొని దివి చాతకము లుబ్బదొడగె.
ధిమిధిమి యనుచు మద్దెల మ్రోయుపాట - లమర నదీమణు లాడుచందమునఁ
ఘుమఘుమ మనుచు మేఘుండు గర్జింప - నమరఁ గేకాస్ఫూర్తి నాడె నెమళ్లు.
రాక్షసాంగములపై రాముబాణములు - లక్షింపఁబడు నిట్టిలాగు నన్నట్లు
పర్వతాగ్రములపై భయదఘోషములు - పర్వి నిర్ఘాతము ల్వడియె నందందఁ.
బ్రకటంబుగా దైత్యపతి మేనిమాంస - శకలంబు లిటు రణస్థలి నిండు ననిన
వరుసున నింద్రగోపము లంతకంత - నరుణారుణంబులై యవనిపైఁ బడియె.
రావణుఁ జంపుచో రఘురాముమీఁద - దేవత ల్తలలూచి దివ్యపుష్పములు710
నెడనెడ వర్షింతు రీక్రియ ననిన - వడువున మహి రాలె వర్షోపలములు.
రావణుకీర్తిపరంపర లణఁగి - పోవు నిం కిట రామభూపాలుచేత
ననినచందమున రాయంచలపిండు - చని క్రౌంచగిరిమీఁదఁ జయ్యన నడచె.
ననిమొనఁ దనపుత్రుఁడైన సుగ్రీవుఁ - డనిమిషాధిపసూను నకట! చంపించె
నలుగు నాపై నింద్రుఁ డని సూర్యుఁ డున్న - బలితంపుకో టన్న పరివేష మొనరె
గుదియని కడఁకతో గోది యాకాశ - నది నాడఁబోయిన నాగకన్యకలు
చని చని మగుడ రసాతలంబునకుఁ - జనుదెంచుగతి వర్షజలధార లమరె.
వాసిగాఁ దమకు జీవనము లవ్వారి - గా సమర్పించిన ఘనుని వేనోళ్లఁ