పుట:Ranganatha Ramayanamu.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గరిబృంహితంబు లాకర్ణించి పెలుచఁ - గరివైరి కోపించుకరణిఁ గోపించి
శితికంఠుచరణరాజీవాలి వాలి - కృతబంధరావణగ్రీవాలి యైన
వాలి సుగ్రీవుని వడి వచ్చి తాఁకె - వాలిసుగ్రీవు లవక్రవిక్రముల
చెలరేఁగి పూర్వపశ్చిమసముద్రములు - బలువిడి పోరాడుభంగిఁ బోరాడ
సమరూపసమగోపసమజవాటోప - సమసుప్రతాపులై జానుజంఘోరు
జత్రువక్షోనాభిజఘనదేశములు - చిత్రవైఖరి నొంచి చించి చెండాడ
నాయెడ ధృతి రాముఁ డమ్ము సంధించి - యేయ నుద్యోగించి యిరువురఁ జూచి
వదనముల్ రదనము ల్వాలము ల్బాహు - లుదరంబు లధరంబు లూరులు బరులు
కక్షము ల్వక్షము ల్కాళ్లును వ్రేళ్లు - వీక్షలు శిక్షలు వేషభాషలును380
జెక్కులు ముక్కులు శిరము లంసములు - పక్కలు పిక్కలు పాదయుగ్మములు
కర్ణము ల్వర్ణము ల్కరము లంగములు - నిర్ణయింపఁగ నొక్కనెరి యైనఁ జూచి
యేతెఱంగునఁ జూడ నిరువురయందు - నీతఁడు సుగ్రీవుఁ డీతఁడు వాలి
యని యేర్పరింపంగ నలవి గాకున్నఁ - దనలోన వెఱఁగంది దశరథాత్మజుఁడు
ఎడపక యేసిన యీయమ్ముచేత - తొడిఁబడి యెవ్వండు త్రుంగునో యనుచు
నమ్ము విడువకుండె నంత సుగ్రీవుఁ - డిమ్మెయిఁ గడునొచ్చి యేపెల్లఁ బొలిసి
వలఁతియై పోరాడి వాలికి నోడి - బలమేది యాతని బలుముష్టిహతుల
సొలసి నల్గడలఁ జూచుచుఁ బాఱిపోయి - గుల్లలతిత్తియై కుట్టూర్పు లెసఁగ
"నేల శ్రీరాముని నమ్మి వచ్చితిని? - నే నేల వాలిని నెదిరించితి నిట?
వచ్చితిఁ బదివేలు వచ్చెఁ జా ల్నాకు - వచ్చినత్రోవఁ బోవఁగవలె" ననుచు390
మెలుకువచెడి తోఁక మెడమీఁద వైచి - సొలసి కెలంకులఁ జూచుచుఁ బాఱి
తనఋశ్యమూకంబు తడయక యెక్కి - తనమది శోకించుతఱి రాముఁ డరుగ
నలఘువిక్రమధాముఁడగు రాముతోడ - దల వంచుకొని యర్కతనయుఁ డిట్లనియె.
“వసుధేశ! నిను నమ్మి వాలితోఁ గదిసి - యసమానబలరూఢి నడరి పోరాడ
న న్నుపేక్షించితి; ననుఁ గావవైతి; - మిన్నక చూచితి; మేకొనవైతి
జగతిపై సూర్యవంశంబునఁ బుట్టి - తగునయ్య; నీ కి ట్లధర్మంబు సేయ
దేవ! నీసత్యంబు తేజంబు నమ్మి - యే వాలిఁ దొడరితి; నింతియే కాని,
యతఁ డేడ? నే నేడ? యాహవం బేడ? - బ్రతికి వచ్చుట యేడ? భావించి చూడ
నేమిభాగ్యముననో యెప్పటియట్ల - రామ! యీపర్వతాగ్రము చేరఁగలిగెఁ;
బగతునిచే భంగపాటు లీరీతి - నగుబాటు నొదవే ని న్నమ్మినకతన400
దగవును గృపయును ధైర్యంబు శక్తి - మిగుల నీయెడఁ జూచి మెచ్చి నమ్మితిని;"
అనవుడు “సుగ్రీవ! యాత్మలో నింత - యనుమానపడ నేల? యకట! నావలనఁ
దప్పు లేశము లేదు దాయకు నిన్ను నొప్పగింతునె? - విను మొకమాట తెలియ;