పుట:Ranganatha Ramayanamu.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నన విని రఘురాముఁ డల్లన నవ్వి - 'వనచరాధిప తాళ్లు వదలక చూపు"
మనవుడు సుగ్రీవుఁ డారాము వేగ - కొనిపోయి యాతాళ్ళగుఱు తెఱిఁగింప
నశనీసంకాశమై యసదృశంబైన - నిశితాస్త్ర మరివోసి నిపుణుఁడై నృపుఁడు
ముంచి యెక్కటఁ బంక్తిముఖునాళ్ళత్రాళ్లు - ద్రెంచినగతిఁ దాళ్లు తెగ నేయుటయును
నవనిపై వక్రంబులై యున్న తాళ్లు - నవిరతంబుగఁ బడినవి గాడిపాఱి
చేరువ గిరిదాఁటి చెచ్చెర మీఱి - ధారుణి దూరి పాతాళంబుఁ జేరి
యలయక తీవ్రత నమ్మహాశరము - తొలఁగక రఘురాము దొన వచ్చి చొచ్చె.
నతులితం బగు రవ మాకాశవీథి - నతులవిమానంబు నందుండి పలికె,
“పరమాత్మ! యే సురపతికడ నుందుఁ - గరుణావ తనియెడు కన్నికఁ దొల్లి
నిరతంబు దుర్వాసు నిందించుటయును - గర మల్గి శాపంబు గావించె నిట్టి350
రూపమై ధరణీశ! రూఢి నీకతన - శాపమోచన మయ్యెఁ జనియెద నింక"
నని చెప్పి కరుణావ తమరేంద్రుపురికిఁ - జనుటయు రఘురాముశరము తా దూణిఁ
జొచ్చినఁ గనుఁగొని సుగ్రీవుఁ డప్పు - డచ్చెరువును బొంది యానంద మంది
"సప్తపాతాళసంసక్తమూలములు - సప్తాశ్వమండలాచ్ఛాదిపత్రములు
నగుసప్తతాళంబు లస్త్ర మొక్కటనె - తెగనేసె నాదు సందేహంబు వాయ
వాలి రాఘవునిచే వడిఁ జచ్చు నింక - నేలితి, లోకంబు లేలితిఁ, దార
నేలితిఁ గపిరాజ్య మే" నని పొంగి - యాలోన కపివీరు లానందమందఁ
గమలాప్తకులనాథుఁ గాకుత్స్థుఁ జూచి - కమలాప్తసుతుఁ డంతఁ గరములు మొగిచి,
"దేవ! దేవరమూర్తి! దృష్టించి లావు - భావింప లేనైతిఁ బశుబుద్ధి నైతి;
నినజుండ నేను; నీవినవంశభవుఁడ; - వని సమబుద్ధినై యపరాధి నైతి.360
నీలోకమున కెల్ల నేలిక వీవు - పాలింపు నన్ను నీబంటుగా నేలు
నాశత్రుఁ దెగటార్చి నారాజ్య మిచ్చి - నాశోక ముడుపవే నరనాథచంద్ర!"
యనవుడు సుగ్రీవు నతికృపాదృష్టిఁ - గనుఁగొని మన్నించి కాకుత్స్థుఁ డనియె.
“చెచ్బెఱ నీవు కిష్కింధకుఁ బోయి - యచ్చట వాలితో నని సేయుచుండు
మవలీల నొకకోల నావాలిఁ జంపి - ప్రవిమలకపిరాజ్యపదము నీ కిత్తు.
వెఱవక సుగ్రీవ! వేగపొ” మ్మనిన - నఱలేనికడఁకతో నప్పు డుప్పొంగి
నలుఁడు నీలుఁడు నంజనాతనూభవుఁడు - బలియుఁ డాతారుండు బలసి తో నడువ
నాజికి సన్నద్ధుఁ డై బల్మి మెఱసి - రాజిల్లు వెనక నారామలక్ష్మణులు
వచ్చి కిష్కింధ కవ్వల నున్నవనము - చొచ్చి గూఢముగ నచ్చోఁ దన్నుఁ బనుప
వడిఁ బోయి కిష్కింధవాకిట నిలిచి - యడరి సుగ్రీవుఁ డుదగ్రుఁడై యార్చి370

వాలిసుగ్రీవులు పోరుట

తడయక తనతోడఁ దగిలి పోరాడ - వడి నేగుదె మ్మని వాలిఁ బిల్చుటయుఁ