పుట:Ranganatha Ramayanamu.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విశ్వమోహనరూపవిఖ్యాతు లైన - యశ్వికుమారుల యట్ల యేపట్ల
వరరూపరేఖలు వాలికి నీకుఁ - బెరసిన సమములై భేదింపరాక
నే నేయ వెఱచితి నిట నమోఘంబు - గాన నీవిధి కీడుగాఁ జూడవలదు;
కరమొప్ప నింక నీగజపుష్పమాల - ధరియించి పోయి యుద్ధము సేయుచుండు
బెదరక వాలిఁ జంపెద నిశ్చయింపు - కదలుము కిష్కింధకడకు నీ” వనుచు
గాదిలితమ్ముచే గజపుష్పమాల - నాదటఁ దెప్పించి యతనికంఠమునఁ
జొక్కంబుగాఁ జేర్ప సుగ్రీవుఁ డొప్పెఁ - జుక్కలు పెనఁగొన్న సోముఁడో యనఁగ410
సరిబలాహకతోడిసంధ్యాభ్ర మనఁగ - మెఱసి యంతయుఁ గడుమీఱి యేతేర
నంతఁ గాకుత్స్థుఁడు ననుజుండు దాను - సంతతంబును యుద్ధసన్నద్ధు లగుచు
నలనీలతారాంజనాతనూభవులు - కెలఁకులఁ గొల్వ సుగ్రీవుఁ దోడ్కొనుచు
నదులు పూపొదలు పున్నాగనారంగ - కదళికాసహకారకాంతారములును
భాసురకైరవపద్మకల్హార - వాసితబహుసరోవరవిశేషములు
కాసరకేసరికరివరాహములు - నాభాక్తిఁ గనుఁగొంచు నటఁ బోయిపోయి
దీపవైశ్వానరతేజులై యొప్పు - సప్తజనాహ్వయసంయమీశ్వరుల
యాశ్రమ మీక్షించి యంతయుఁ దెలిసి - సుశ్రీమహత్వంబు సుగ్రీవుచేత
బలశాలి యగు వాలి పాలించుసిరుల - విలసిల్లుకిష్కింధ వీక్షించి నృపుఁడు
తొల్లింటిచందాన దుర మొనరింపు - బల్లిదుఁ డగువాలిఁ బరిమార్తు ననుచు420
గృతమతి నంత సుగ్రీవు మన్నించి - యతనిఁ బొమ్మని పంచి యాసమీపమున
ననుజుఁడు సౌమిత్రి యటు చేరియుండి - మనుజేశుఁ డొకమానిమాటున నుండె.
నహిమాంశునందనుం డంతఁ గిష్కింధ - గుహ లెల్ల భేదిల్ల ఘోషించి యార్చి
తనతోడ ఘోరయుద్ధమునకు నింద్ర - తనయుఁ బిల్చుటయు నెంతయు బిట్టు గినిసి
“మానక వీఁ డొక్కమగవాఁడు పోలెఁ - బూనినభుజశక్తిఁ బొంగుచున్నాఁడు
వీని సైరించుట వెరవుగా దింక - వీనిఁ జంపెద" నని వెస నిశ్చయించి

తార సుగ్రీవునితోఁ బోరవద్దని వాలి నడ్డగించుట

యతిసత్త్వజయశాలి యగు వాలి వెడలఁ - బతిఁ జూచి వెస నడ్డపడి తార పలికె.
"దేవేంద్రనందన! దినపజుమీఁద - నేవిచారము లేక యేల పోయెదవు?
నతఁడు నీతో నిప్పు డని చేసి నొచ్చి - మతి చెడి పాఱి క్రమ్మఱ వచ్చు టెల్ల
నెగడిన కడిమిమై నీకంటె నెక్కు - డగుసహాయము లేక యతఁ డిందు రాఁడు.430
అనిమిషేశ్వరపుత్ర! యదియునుగాక - యొనర నంగదుచేత నొకమాట వింటిఁ
బనివడి తమతండ్రి పనుపునఁ జేసి - వనవాసమున నుండ వచ్చినచోట
దశరథరాముఁడు తనధర్మపత్ని - దశకంధరునిచేతఁ దాఁ గోలుపోయి
తనతమ్ముఁడును దాను దడయక వెదక - నని వారు ఋశ్యమూకాద్రికి వచ్చి