పుట:Ranganatha Ramayanamu.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈరీతి భరతేశుఁ డెల్లసైన్యములు - నాఋషిఁ బొగడుచు నారాత్రి దీర్చి
మఱునాఁడు పురము తన్మందిరావళులు - తెఱగంటిచెలులు నదృశ్య మౌటయును
భరతుఁ డత్యాశ్చర్యభరితుఁడై యుండి - వరతపోనిధి భరద్వాజునిఁ జేరి
ప్రణమిల్లి “మీతపోబలమహత్త్వములు - ప్రణుతింపఁ దరమె యాపరమేష్ఠికైన
నే నింక రఘురాము నినకోటిధాముఁ - గానఁ బోయెద” నంచుఁ గన్నతల్లులను
నవ్వేళ మ్రొక్కింప నతఁడు "వీ రెవ్వ - రెవ్వరు వేర్వేఱ నెఱిఁగింపు" మనుడు
“ధీరాత్మ నృపు పెద్దదేవులై యెల్ల - వారిలో వాసియు వన్నెయుఁ గాంచి
కడుపు చల్లఁగ రాముఁ గాంచియు వగల - నుడుకుచున్నది తద్వియోగాగ్నిశిఖలఁ1500
బరిచితజనసాఫల్య కౌసల్య; - పరికింపు మిదె మునిపతిసార్వభౌమ
కౌసల్యసతివామకర మంటఁ బట్టి - కైసేఁత లుడిపోయి గతపుష్పకర్ణి
కారశాఖయుఁ బోలి కై వ్రాలియున్న- యీరామ శ్రీరాము నెడఁబాయలేని
యాలక్ష్మణునిఁ గన్నయట్టి పుణ్యాత్ము - రాలు సుమిత్ర; పరాకు! మునీంద్ర
యేతల్లికై కాన కేగె మాయన్న? - యేతల్లికతమున నీల్గె మాతండ్రి?
యేతల్లికోర్కి నన్నింతకుఁ దెచ్చె? - నీతల్లి మాతల్లి హితపుణ్యపాక
కైకఁ గన్గొను” మంచు గద్గదకంఠుఁ - డై కడపట శోక మగ్గలంబైన
నూరక యున్నచో నూరార్చి యతని - నాఋషి భావికార్యముఁ జూచి పలికె
“యీకైక లోకైకహితము గావించె - మీ కెల్ల తెల్లమౌ నిటమీఁద" ననుచు
మఱి రాముఁ డున్నట్టిమార్గంబు దెలిపి - తెఱఁగొప్ప నమ్మౌని దీవింప వెడలె.1510
సింధురబృంహితసేనానులాప - సైంధవహేషితస్యందననేమి
రవములకళికి యరణ్యమృగాళి - తివిరినభీతి నల్దెసలకుఁ బాఱ
బలరణోద్ధూతవిపాంసుసంఘాత - మలినీకృతాదిత్యమండలుం డగుచు
నాచిత్రకూటాద్రి కర్థితో భరతుఁ - డేచి సేనలుఁ దాను నేగుచో నంత
నటఁ జిత్రకూటాద్రియందు రాఘవుఁడు - కుటిలకుంతల సీతఁ గూడి మోదమునఁ
“గనుఁగొంటివే యిన్నగంబు బింబోష్ఠి - కనుదమ్ములకు విందు గావించె మనకు
నిన్నగమహిమఁ దా నెన్నఁగ వశమె? - పన్నగపతికైన భామాలలామ!
గుఱుతైన సెలయేటిఘుమఘుమధ్వనులు - ఉఱుము లటంచుఁ బెల్లుబ్బి నీకురులు
పురడింపఁ దనగొప్పపురి విచ్చి నెమలి - పొరిఁబొరి యాడెడుఁ బూఁబోణి చూడ
కాంతరో! యీచెంచుకాంతల కంటె - దంతికుంభంబులు తమచన్నుఁగవకు1520
నెన వచ్చు టె ట్లని యిభకుంభదళన - మొనరించి తన్మణు లోప్పఁ దాల్చెదరు
దివ్యుల సంకేతదేశంబు గాన - దివ్యవాసనలు సంధించె నీకోన
పదతలాలక్తకభాసురంబైన - పొగఁ జూడ గంధర్వభోగగేహంబు
కిన్నరకంఠి! యీగిరిగహ్వరంబు - కిన్నరకిన్నరీగీతసద్గోష్ఠి