పుట:Ranganatha Ramayanamu.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నతఁడు చూపినత్రోవ నటఁ బోయిపోయి - క్రతుహోమతతధూమకబళితవ్యోమ
కృతకాంబుదస్తోమకేవలముదిత - కృతలాస్యవిపినబర్హిణబర్హజాల
రచితాంతరాంతరరత్నవిచిత్ర - ఖచితతోరణపదక్రమము నై యొప్పు
నాభరద్వాజసంయమియాశ్రమమున - నాభరతుఁడు పోయి యనతిదూరమునఁ
జతురంగబలములఁ జతురత నిలిపి - యతులపుణ్యాత్మకుం డగుభరద్వాజుఁ

భరతుఁడు భరద్వాజాశ్రమంబుఁ జేరుట

గని భక్తితో నమస్కారము ల్సేయఁ - గని యమ్మహాముని కడు నల్గి పలికె.
"భరత! యీచతురంగబలములఁ గొనుచు - భరితసన్నాహసంభ్రముఁడవై నీవు
కడుశాంతవృత్తి రాఘవుఁ డరణ్యములఁ - బడియుండ నాతనిపైఁ బోవ నేల?"
ననుచున్నమునికోప మంతయు నెఱిఁగి - వినతుఁడై భరతుండు వెఱచుచుఁ బలికె1470
“జానకీవల్లభ! సకలరాజ్యంబు - పూనుము నీ వని పోయెదఁ గాని,
యొండుభావమునఁ బో మోమునినాథ! - యొండుగాఁ దలఁపకు ముల్లంబులోన”
ననిన సంతోషించి యాముని వలికె - “ననఘాత్మ! నీవు నీ యఖిలసైన్యమును
మనమార నాయాశ్రమమున నేఁ డుండి - వినుతి మే మొనరించువిం దారగింపు"
మని విశ్వకర్మను నటకు రప్పించి - "ఘనచిత్రపురి యొండు గల్పించి యందు
వారు వీ రన కెల్లవారికిఁ దగిన - మేరల నిండ్లు నిర్మింపు మీ” వనిన
నైదుయోజనముల నతఁ డొక్కపురము - భూదేవిచరణనూపురము నిర్మించి
నందుఁ గాంచనమయం బౌ నొక్కరాజ - మందిరం బమరెఁ; దన్మందిరంబునను
శ్వేతాతపత్రోరుసింహాసనమునఁ - జాతురి నొకసభాసదన మింపొందె
నప్పుడు మునియాజ్ఞ నట భరతుండు - విప్పైనగృహము ప్రవేశించి యందు1480
సింహాసనము గాంచి శ్రీరామనృపతి - సింహాసనం బంచుఁ జేతులు మొగిచి
యాసమీపంబున నపు డొక్కపీఠి - నాసీనుఁడై మిత్రు లందఱు గొలువ
నున్నచో మునియాజ్ఞ నొక్కట వచ్చి - కిన్నరగంధర్వఖేచరాంగనలు
నచ్చట నచ్చర లాటలు పాట - లచ్చెరువుగఁ జూపి రతనిసన్నిధిని
నీరీతి సకలజనావళి యిండ్ల - నారూఢి వెలసె నాట్యప్రసంగములు
నిలమీఁద దివిమీఁద నేయేవిశేష - ములు కల వన్నియు మునియాజ్ఞ వచ్చె.
జానపదు ల్పౌరజనము లందఱును - స్నానముల్ కావించి చలువలు గట్టి
మందారపుష్పదామంబులు పూని - చందనం బలఁది భూషణములు పెట్టి
వేవేలతెఱఁగుల వింతగా వేల్పు - టావు చతుర్విధాహారంబు లొసఁగఁ
బరితృప్తులై దివ్యభామలు దమకు - సురతవిశేషముల్ సొక్కుచుఁ దెలుపఁ1490
జన్మసాఫల్యంబు సమకూరె ననుచుఁ - దన్మయావస్థలఁ దగిలి గ్రీడింప
నమ్మునియాశ్రమం బటు చూడ నొప్పె - నిమ్ముల నాస్వర్గ మేవగించుచును