పుట:Ranganatha Ramayanamu.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలకంఠరవసహకారపల్లవము - కలకంఠి! యీసహకారంబుఁ జూడు;
పరిపరివిధముతోఁ బరువంపువిరుల, పరిమళంబులు గదంబముగఁ గూర్చుచును
మలయానిలుండు కోమలయానలీల - మలయుచున్నాఁ డిదె! మనపైన నబల!
యల్లదె! చూచితే? హల్లకనికర - ఫుల్లకైరవకుంజపుంజరంజితము
సాలతమాలరసాలతక్కోల - తాళహింతాలకుద్దాలకూలములు
అమలినపులినమధ్యాసనాసీమ - సముచితమునిబృందసందీప్తమైన1530
మందాకినీనది మనకన్ను లలరె - మందయానవిలాసమథితమరాళ"
యని యని పలుకుచు నవనీరుహములఁ - గనుపట్టు బొదరిండ్ల ఘనకందరముల
శైలశృంగంబుల సానుదేశముల - నోలి వినోదించుచున్నచోఁ గడగి
బలువిడి చనుదెంచు భరతసైన్యముల - కలకలస్వనము లాకర్ణించి బిట్టు
కలఁగి నల్గడఁ బాఱు కరివరాహాది - బలమృగంబులఁ జూచి బలధూళిఁ జూచి
"యిట ధూళి దివిఁ బర్వ నేమి కారణమొ?- యటఁ బోయి యరసి ర"మ్మనిన లక్ష్మణుఁడు
వేవేగ నొకమహావృక్షాగ్ర మెక్కి - భావించి యుత్తరభాగంబునందు
బలములఁ బొడఁగాంచి భానువంశజుల - బలుబిరుదులతోడఁ బడగలు గాంచి
యిచ్చలో భరతేశుఁ డిట రాముమీఁద - వచ్చుచున్నాఁ డని వడి నిశ్చయించి
పటువజ్ర మద్రిపైఁ బడుభంగి దోఁప - జటులసత్త్వమున వృక్షము డిగ్గ నురికి1540
వారక రోషదుర్వారుఁ డై వచ్చి - యారామవిభుఁ జూచి యనియె లక్ష్మణుఁడు.
“అడవికి నిన్నుఁ బోనడచి నీరాజ్య - మడరి యంతయుఁ గొని యంతటఁ బోక
ఘనశక్తి నీమీఁదఁ గైకేయికొడుకు - చనుదెంచుచున్నాఁడు సబలుఁడై నేఁడు
యదె చూడు! కోవిదారాదిధ్వజంబు - నదె చూడు భటుల వీరాలాపములును
శరచాపకవచముల్ సరిఁ బూని నీవు - భరతుని కెదురుగా బలువిడి నడువు
నిలువుము కాదేని నీవు సీతయును - దొలఁగుము నీశాంతి తుది నింతఁ జేసె!
నే నింక సైరింప నిట వచ్చె నేని - వీనిఁ జంపెద” నన్న విని రాముఁ డనియె.
“నాకుఁ దమ్ముఁడ వయ్యు నాతోడఁ బుట్టి - నీ కిట్టియవినీతి నీకేలఁ బుట్టె?
భ్రాతృవత్సలమూర్తి పరమపావనుఁడు - నీతికోవిదుఁడు మానితధర్మపరుఁడు
భరతుండు నీకంటె భక్తుండు నాకు - భరతునిదెస నొక్కపాపంబు లేదు1550
మరల నయోధ్యకు మగుడఁ బ్రార్థింపఁ - జనుదెంచుచున్నాఁడు సందేహ ముడుగు
కడవకు” మనుఁడు రాఘవునాజ్ఞపెంపు - కడవ భీతిల్లి లక్ష్మణుఁ డూరకుండె.
భరతేశుఁ డంతటఁ బౌరుల హితుల - దొరల సమస్తయోధుల నొక్కచోట
విడియించి తల్లుల వెనకఁ దోడ్తేరఁ - గడక వసిష్ఠునిఁ గట్టడచేసి
గురుభక్తి సూతుండు గుహుఁడు తోడుగను - నరిగి తమ్ముఁడు దాను నగ్గిరి నెక్కి
వరుస నయ్యడవి త్రోవలు తెలియుటకుఁ - గరమర్థి సౌమిత్రి గట్టినయట్టి