పుట:Ranganatha Ramayanamu.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెరువులు చక్కఁగా దిద్దింపుఁ డఖిల - పురజనులకు నేగఁ బొసఁగినరీతి1430
నెడనెడ విడుదు లనేకవస్తువులు - గడుసమగ్రములుగాఁ గావింపుఁ" డనిన
ననుకూలమతి వార లట్ల చేయించి - రనుపమోత్సాహులై యమ్మఱునాఁడు
మందిమాగధులును వరమంత్రివరులు - సుందరీనటనర్తసుకుమారవరులు
నవసహస్రములు దంతావళఘటలు - జవనాశ్వకోటి లక్షయు శతాంగములు
నఱువదిలక్షలు నమితపదాతి - తఱుచుగా నడువఁ దత్తఱిఁ బౌరజనుల
జనపదస్థుల నెల్లజాతులవారి - ధనరత్నరాసులు తగ వసిష్ఠాది
మునుల రాజుల మంత్రిముఖ్యులఁ గొనుచు - తనతమ్ముఁడును దాను దల్లు లందఱును
ననువుగాఁ జతురంతయానంబు లెక్కి - వెనుక రా భరతుఁ డవ్విధమునఁ గదలి
పోయి గంగాతీరమున దండు విడియ - నాయతభుజశీలుఁ డగుగుహుం డెఱిఁగి
కడఁగి రామునిమీఁదఁ గైకేయికొడుకు - నడచుచున్నాఁడు సేనలతోడ ననుచు1440
నలవుమైఁ గోపించి నావ లాగించి - బలములతో వచ్చి భరతుని కనియె.
“భరత! రాముఁడు రాజ్యపదవి నీ కిచ్చి - యరుదుగా మునివృత్తి నడవుల నుండ
నీవు సేనలఁ గూడి నిజశక్తి మెఱసి - పోవుచున్నాఁడవు పోలునే నీకు?
నేను రామునిబంట నే నంప నిన్నుఁ - బోనీను నీబలంబుల సంహరింతు.
నడరి నీతోడఁ బోరాడి ప్రాణములు - విడిచిన మఱి రామవిభునిపైఁ బొమ్ము"
అని రోషమున గుహుఁ డాడువాక్యములు - విని భరతుఁడు నవ్వి విమలుఁడై పలికె.
“బరమాత్ముఁ డగురాముఁ బ్రార్థించి తెచ్చి - పరఁగ నయోధ్యకుఁ బట్టంబు గట్టఁ
బోవుచున్నాఁడ నాబుద్ధిలో నొండు - భావించి నీ విట్లు పలుకంగవలదు"
అని యన నాతని నక్కునఁ జేర్చి - తనమది పొగుల నాతని చిత్త మెఱిఁగి
యనురక్తి భరతేశునడుగుల కెఱఁగి - యనువమవన్యంబు లైనవస్తువులు1450
కని దనియఁగఁ బెక్కుకానుక లిచ్చి - కొనిపోయి గుహుఁడు కాకుత్స్థుండు తొల్లి
విడిచినచోటున విడిచి, సంప్రీతి - జడలుగట్టినచోటు చనిచని, చూప
జనులును మునులును సచివులు దానుఁ - గనుఁగొని భరతుండు కడుశోక మంది
సీత రాముండును జేరి పరుండ - నాతతతృణశయ్యలందుఁ గన్పడెడు
తరుచైనకనకవస్త్రములచిహ్నములు - పొరిఁ గనుఁగొని మదిఁ బురపురఁ బొక్కి
ఘనశోకమును బొంది కడుదీనుఁ డగుచు - మును రాఘవుఁడు జటల్ మొనసి ధరించె
నెక్కడ నని భరతేశ్వరుం డప్పు - డక్కడ కేమును ననువుగా జటలు
పనుపుచు మఱి మఱ్ఱిపాలు దెప్పించి - తనతమ్ముఁడును దాను ధరియించె జడలు.
భరతుండు మఱునాఁడు బ్రాహ్మికకర్మ - పరుఁడునై గుహుఁడు రాఁ బన్నించినట్టి
యేనూఱుబలునావ లెక్కి వేర్వేఱ - దాను దల్లులు మునుల్ తగ మంత్రివరుల1460
సకలసేనలుఁ గూడ జాహ్నవి దాఁటి - యకళంకుఁ డగు గుహు నపుడు తోడ్కొనుచు