పుట:Ranganatha Ramayanamu.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నీకలదినములు నిష్ఠ పెంపొందఁ - జేకొని మమ్ము రక్షించితి వీవు;
నీయట్టికొడుకును నిజముగాఁ బూని - యేయుగంబులఁ గందు నే నింక ననఘ!
దురితదూరుఁడవు బంధురతపోనిధివి - గురుభక్తుఁడవు నీవు గురుభక్తియుతులఁ
బరలోకపరు లార్యపరులు ధర్మైక - పరు లెందు నిజశౌర్యపరు లార్తిహరులు
అన్నదానాదిమహాదానపరులు - గన్నలోకంబులు గనుము నీ" వనుచుఁ
గర మొప్ప నగ్నిసంస్కారాదివిధులు - తరమిడి చేసిరి తమతనూజునకు1250
నమరుఁడై యతఁ డంత నాకాశవీథి - నమరవిమానంబునందుండి పలికె.
"ఓగురులార! యే నుత్తమలోకభోగభాగ్యుఁడ నైతి; పుణ్యుండ నైతిఁ;
గరమర్థి మిముఁ గొల్చుకతమున నాదు - మరణంబునకు మీరు మలఁగకుఁ డింక,
నేకాల మేత్రోవ నేది గావలయు - నాకాల మాత్రోవ నది గాకపోదు
అయ్యెడుకార్యంబు లగుఁగాక మాన- వయ్య! మీ రితనిపై నలుగకుం” డనుచు
ననిమిషపురి కేగ నతఁ డంత వారు - తనయునిపైఁ గూర్మి ధరియింపలేక
“పోయెద మే మిదె! పుత్రశోకమున మాయట్ల నీవును మరణంబు నొందు”
మని ఘోర మగుశాప మలిగి నా కిచ్చి - తనువులు విడిచి రత్తపసు లచ్చోట
నగ్నిసమానుల నాపుణ్యధనుల - కగ్నిసంస్కారాదు లట నేను జేసి
చేకొన్నవగల వచ్చితిఁ బురంబునకు - నాకర్మఫల మిదే యాసన్నమయ్యె.1260
ధీరత చెడి బుద్ధి తిరుగుచున్నదియు - నో రెండఁ జొచ్చెఁ గన్నులు గానవయ్యెఁ!
బలుకులు వినరావు ప్రాణంబు లింక - నిలువ వీయొడలిలో నిలుపంగలేను;
నాపాలి కల్పద్రు నాధీసముద్రు - నాపరాక్రమరుద్రు నాగుణోన్నిద్రు
నాభాగ్యపదభద్రు నారామభద్రు - శోభనగుణముద్రుఁ జూడలేనైతి.

దశరథుఁడు ప్రాణముల విడుచుట

నీరాత్రితోఁ గూడ నేడునా ళ్ళయ్యె; - శ్రీరాముఁ బాసి నాజీవ మెట్లుండు?
నని ప్రలాపించుచు హారామ! రామ! యనుచు నంతనె మృతుండయ్యె నారాజు.
వనటలఁ గుంది భూవరుఁడు నిద్రించె - నని తాను నిద్రించె నంతఁ గౌసల్య.
పరికించి యంతఁ బ్రభాత మౌటయును - గరమర్థి వందిమాగధులు నుతింప
దొరకొని మంగళతూర్యముల్ మ్రోయఁ - బురి నుండువారెల్ల గిరికొని వచ్చి
ధరణీశదర్శనోత్కంఠు లై యుండ - నిరవొప్ప నేఁ డేల యిన్నాళ్ళరీతి1270
దొర మేలుకొనఁ డంచు దొరకొన్నచింతఁ - బరిచారకులు వచ్చి పతిసెజ్జ డాసి
ధరణీశుఁ డున్నచందము పోల దనుచు - నురుభయంబును బొంది యూరుపు లలర
యడుగులు చేతులు నంటంటి చూచి - యెడలఁ బ్రాణములు లేకునికి భావించి
యందఱుఁ బెలుచ మహారోదనంబు - లందంద సేయ దిగ్గన మేలుకాంచి