పుట:Ranganatha Ramayanamu.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యదరి కౌసల్యయు నాసుమిత్రయును - బెదరి యందఱఁ జూచి పృథివీశుఁ జూచి
హా! యని యెలుగెత్తి హాప్రాణనాథ! - పోయితే దశరథ భూనాథ! యనుచు
విలపింపఁ గైకేయి విని రాఁగఁ జూచి - పలుమాఱు గైకేయిపై మోదుకొనుచు
"గైక నీకోర్కులు కడముట్టె నేఁడు - కైకేయి కలఁచితే కాకుత్స్థకులము?
నడవులపాలు గమ్మని రాముఁ ద్రోచి - సడి కోర్చి దశరథేశ్వరుఁ జంపుకొంటి
నెలకొని యిటమీఁద నీవు నీసుతుఁడు - నిలయెల్ల గైకొని యిపుడు భోగింపుఁ"1280
డనుచు నాకౌసల్యయాదిగా సతులు - తనుఁ జేరికొని యేడ్వఁ దల వంచుకొనుచు
నలిఁ దూలి చనుదెంచి నాథుపై వ్రాలి - పలుదెఱంగులఁ గైక పలవించుచుండె.
నాసమయంబున నడలు దీపింపఁ - గౌసల్య దశరథుఁ గనువిచ్చి చూచి
"ధరణీశ! నియట్టి ధర్మస్వరూప - చరితున కీచావు సమకూరఁదగునె?
మోసపోయితి నిన్ను ముదలింపలేక - నీసత్యసంపద ని న్నింత చేసెఁ;
గడుకష్టమతి యైన కైకేయిఁ జూచి - యడవికి రాముఁ బో నడచిన వగపు
పరికించి నీ కేను బరిచర్య సేయ - భరియింపలేనైతిఁ బార్థివోత్తంస!
నీయిచ్ఛలో నుండ నీపంపుఁ జేసి - పోయి సత్కీర్తులు పొందె రాఘవుఁడు.
నెలకొన్న సత్యంబు నీవు పాటించి - బలిసి నిలింపసంపదలు గైకొంటి
ధరణీశ! నాకు నుత్తముఁ డైన నిన్నుఁ - బరుసంబు లాడినఁ బాపంబు దక్కె.”1290
నని చాల పలవింప నాసుమిత్రాది - వనితలు గొంతెత్తి వాపోవుచుండ
నంతట నీవార్త లందంద మ్రోసెఁ - గాంతలయేడ్పు లాకసమెల్ల నిండె.
నంత సూర్యోదయం బయ్యె నౌటయును - ఎంతయు భయముతో హితులు బాన్ధవులు
చేరువ నృపులు వసిష్ఠాదిమునులు - ధారుణీసురలు ప్రధానులు వచ్చి
భూరిశోకంబునఁ బొగులు వసిష్ఠుఁ - డారూఢమతిమంతు ననుమతిఁ బడసి
తడయక దశరథధరణీశుమేను - గడఁకతోఁ దైలపక్వంబు సేయించి
చెలువైన మణిమయసింహాసనమునఁ - గొలువున్న తెఱఁగునఁ గూర్చుండఁబెట్టి
మంత్రులు సకలసామంతులు రాజ - తంత్రజ్ఞులను గూర్చి తగవునఁ బలికె;
“నీరాజు సామ్రాజ్య మెల్లఁ బాలించి - స్వారాజునగరికిఁ జనియె నేఁ డకట!
ఇతనిపూనిక దీర్చ నింతియుఁ దాను - హితమతియై రాముఁ డేగెఁ గానలకు.1300
భరతుండు తమమామపట్టణంబునకు - నరిగె శత్రుఘ్నసహాయుఁడై మున్నె
మనము రామునిఁ బిల్వ మరలిరాఁ డతఁడు - తనపూన్కి దీర్పక ధర్మవర్ధనుఁడు
కావున భరతు వేగమె పిలుపింపఁ - గావలయును రాజకార్యముల్ దీర్ప
రాజు లేకున్నఁ బురంబు రాష్ట్రంబు - రాజిల్ల దెల్లవర్ణంబులుఁ గలయ
దండనీతిక్రియల్ దానధర్మములు - మెండోడి చెడిపోవు; మింతురు రిపులు;
జారులు చోరులు సందడింపుదురు - కోరి నొంతురు సాధుకోటి దుర్జనులు