పుట:Ranganatha Ramayanamu.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“యేలయ్య! దశరథ యేల శోకాగ్నిఁ - గ్రాల? మాతనయు నెక్కడ దాఁచి తీవు?
అడవులఁ దపసులై యంధులై యున్న - బడుగులఁజంపి పాపముఁ గట్టుకొంటి
యడరి నీదగుబాణ మదరంటఁ గొన్నఁ - బడునప్పు డేమని పలికెనో కొడుకు?
పాయనివేదనఁ బ్రాణముల్ విడిచి పోయెనో? విడువకఁ బొదలుచున్నాఁడొ?
మృతికైన నొండునిమిత్తంబు లేదె? - యతిసుతుఁ డఁట బాణ మఁట చావు విధియుఁ
బుడమి వానప్రస్థుఁ బొలియించేనేని - చెడు నింద్రుఁడైనను జెడఁడె భూవిభుఁడు?
అవనీశ! మాపుత్రు నజ్ఞానబుద్ధి - తవిలి యేసితి గానఁ దగదు ని న్నలుగ;
మాకుఱ్ఱఁ జూడక మముఁ గొని క్రాలు - శోకాగ్ను లారవు; చూపవే వాని;”1220
ననియని శోకించు నాతపోధనులఁ - గొనిపోయి వీఁడె మీ కొడు కనుటయును
వేఁడి పయోధారవిమలమానసుఁడు - వేఁడి తపోధనవిపులపుణ్యుండు
వేఁడి సుధీజనవితతవర్తనుఁడు - వేఁడి నిరంతరవేదతత్పరుఁడు.
అనుచుఁ జేతులు చాఁచి యందంద వెదకి - తనయునిపైఁ బడి తల్లి శోకించి
తొడలపై నునిచి నెత్తుటఁ దోగియున్న - జడలలోఁ దలఁ జేర్చి సంతాప మంది
“యోవిమలాత్మక! యోయజ్ఞదత్త! - యోవిశ్రుతాచార! యోధర్మనిపుణ!
యెందు నాతోడ నీ విటఁ జెప్పికాని - యెందును బోవ వీ విది యేమి? నేఁడు
నాకలోకమున కున్నతిఁ బోవుచుండి - నా కేల చెప్పవు? నావంశతిలక!
కడవఁ జేసెడు పాపకర్మురా లైతి - నడురేయి ని న్గడువడిని బొమ్మంటి;
నేచినగురుభక్తి నెల్లలోకములఁ - గాచినకొడుకు నిక్కడఁ జంపుకొంటి;1230
నా కేటి తప మింక నాకు నీతోడి - లోకంబె కా కింక లోకైకవినుత!
యెక్కడి నీప్రాణ ? మెక్కడి బాణ?- మెక్కడి దశరథుం? డెక్కడ నీవు?
ఇన్నియు నొడఁగూర్ప నిటు నేఁడు గలిగి - నిన్ను దెక్కొనియెనా నీకర్మఫలము?"
అని తల్లి శోకింప నమ్మునీశ్వరుఁడు - తనయునిపైఁ బడి తద్దయు వగచి
"నీవు నాకడ కతినిష్ఠతో వచ్చి - కావింతు ప్రీతిసత్కారముల్ తొల్లి
యేను నీకడ కిప్పు డేతెంచియున్న - నేనెయ్యములు సేయ విటు నీకుఁ దగునె?
కొడుక నీనిర్మలగుణకలాపములు - వెడలెనే యీబాణవివరంబునందు?
నెవ్వనిఁ జదివింతు నింక వేదములు? - నెవ్వనిఁ జదివింతు నింక శాస్త్రములు?
నెవ్వని వినిపింతు నింక ధర్మువులు?-ఎవ్వని కెఱిఁగింతు నింకఁ గావ్యములు?
ఫలములు జలములు పరికించి మాకు - నలయకుండఁగ నెవ్వ రరసి పెట్టెదరు?1240
దీర్ఘాయు వని నిన్ను దీవింతు గాని - నిర్ఘాతపటుబాణనిహతి పల్కితినె?
జమునైనఁ బుత్రభిక్షము వేఁడుకొనెదఁ - గొమరార నచటికిఁ గొనిపోఁగదయ్య!
పనివడి యెందును బరలోకవిధులు - తనయు లొనర్తురు తల్లిదండ్రులకు
బరిపాటి దప్పించి పరలోకవిధులు - మరలించి విధి నీకు మముఁ జేయఁబనిచె;