పుట:Ranganatha Ramayanamu.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గురుతుగా నేను నాగురుల నం దుంచి - యరసి పోషణసేయ నందున్నవారు;
కర మొప్ప గురువుల గ్రక్కున డించి - పరితాప మొందక భయపడ కీవు;
కావున వారికిఁ గలశోదకములు - వేవేగఁ గొనిపోయి వినుపింపు మీవు;
మనుజేశ! నీయస్త్రమరణంబు నాకు - ననుచిత మీబాణ మల్లనఁ బెఱుకు;
మీశరవేదన కే నోర్వఁజాల; - నాశరీరమునఁ బ్రాణము లుండ వింక;"
ననపుడు నే నప్పు డల్లనఁ జేరి - ఘనమైనశోకాగ్నిఁ గ్రాలుచు వగచి
యమ్ముఁ బెఱుకఁబూని యటు ముట్టవెఱచి - క్రమ్మఱఁ దెగువమైఁ గలఁగి కంపించి
పనిగొనువగలతో బాణంబు వెఱుక - మునికుమారుఁడు ప్రాణములు వాసె; నంతఁ
గలఁగుచు నేను నాకలశంబుతోడి - జలములు గొని తదాశ్రమభూమి కరిగి
యతివృద్ధులై యంధు లై తా రనన్య - గతికులై నిజసుతాగమన ముల్లముల1190
నెడపకఁ గోరుచు నెఱకలు విఱిగి - పడియున్న పక్షులు పగిది నట్లున్న
ఘనపుణ్యు లగువారిఁ గన్గొని చేరఁ - జనుదేరఁ దాఁ గాలి చప్పు డాలించి
“యోపుత్ర! యిటు తడవుండుదువయ్య! - మాపట్టి రా కేల మసలెనో యనుచు
దలఁకుచుండితిమి మీతల్లియు మేము - నిలుతువె యొకచోట నీ వింతప్రొద్దు;
తనయ! నీ వెక్కడ తడసితివయ్య! - కనుఁగొనఁగా మాకుఁ గన్నులు నీవ;
అతివృద్ధులకు మాకు నాధార మీవ - గతిలేనిమాకు సద్గతియును నీవ
యిది యేల పలుకవు? ఏ మంటి నిన్ను?- నుదకముల్ తెమ్మంటి నోకుమారకుఁడ!"
యని పల్కు మునిపల్కు లంతరంగమునఁ - బెనఁగొన్న శోకంబు భీతియుఁ బెనుప
చె ట్టెక్కి కావిడి శీఘ్రంబ డించి - యట్టిట్టు వడఁకుచు నతిదీనవృత్తిఁ
జెప్పెద నన వచ్చి చెప్పరాకుండి - చెప్పకపో దని చెప్ప నూహించి1200
చలియించి గద్గదస్వరముతో వెడలు - పలుకులఁ దడబాటుపడుచు నిట్లంటిఁ.
“దాపసోత్తమ! యేను దశరథమేది - నీపాలకుఁడఁ గాని నీపట్టిఁ గాను;
నీచకర్ములు విన్న నిందించునట్టి - నీచకర్మము నాకు నేఁడు సిద్ధించె.
నేయుగంబులయందు నెవ్వరు నిట్లు - సేయనిపాపంబుఁ జేసి మీకడకు
వచ్చితి నేమని వాక్రువ్వ నేర్తుఁ - దెచ్చె దైవం బిట్టి తెంపు సేయుటకు
సరయువుపొంత నిశావే వేఁటఁ - దిరుగుచు మృగము లేతెంచు చక్కటికి
వీనుల దృష్టించి వెస శబ్దవేధు - లైనబాణము లేసి యందందఁ జంప
నీరుకందువనుండి నీకుమారుండు - నీరు నింపఁగఁ గుంభనినద మాలించి
యేనుఁగుతలఁపున నేసితిఁ గాన - నానతి నా కేమి యనఘ! మీతనయు
ప్రాణముల్ గొనియె నాపటుబాణ" మనినఁ - బ్రాణముల్ ఝల్లని పడి మూర్ఛవోయె.1210
నామునిపత్నియు హాపుత్ర! యనుచు - భూమిపైఁ బడి రిత్త వొందునట్లున్న
నప్పు డే నడలుచు నల్లనఁ దెలుపఁ - దెప్పిరి వారు నాదెస మోము లెత్తి