పుట:Ranganatha Ramayanamu.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ననుఁ గన్నతల్లికి నారామిఁ జెప్పి - యనుమానపడి యెంత యడలునో తండ్రి?
యాటలమరిగి రాఁ డని చూతురొక్కొ? - నీటికందువ లేమి నిలిచినాఁడొక్కొ!
యేమని వగతురో? యీచావు విన్న? - నేమి గాఁగలవారొ యిటమీఁద వారు?
ఎవ్వరు నుదకంబు నిచ్చెద రింక? - నెవ్వరు ప్రోచెద రిటమీఁద వారిఁ?
గడఁగి యీబాణ మొక్కటనె మువ్వురముఁ - బడితి మిం కేమని పలవింతు విధికి.”
నని విలాపించుచో నావిలాపములు - విని “యెప్పుడెప్పుడు విరియునో తమము
ఎప్పుడు చూతునో యిమ్మహాపురుషు - నిప్పాటు పాటిల్లెనే నేఁడు నాకు”
ననుచుండ నుదయించె నంతఁ జందురుఁడు - వనధిలో నాశోకవనధి యుప్పొంగ
చందురుఁ డుదయింప సరయువు దాఁటి - యందు నత్తీరంబునందును వెనుక
తనచేతికలశంబు ధరణిపై వైచి - తనచెక్కు కలశమస్తకమునఁ జేర్చి1160
యురమున వీఁపున నొండొండ నెడలు - నురురక్తధారలు నొడలెల్లఁ దోఁగి
వీడినజడలతో విశిఖవేదనల - వాడినమోముతో వసుధపై వాలి
శర ముపదేశమై చనఁ జొచ్చి లోనఁ - బరికించి దేహసంబంధంబు లణఁచి
యేకర్మములయందు నీడాడనీక - గైకొని యింద్రియగతు లుజ్జగించి
కడపటియోగంబుఁ గని తన్ను మఱచి - పడియున్న యోగికైవడి నూరకున్న

దశరథుఁడు యజ్ఞదత్తుని జూచి చింతించుట

మునికుమారుని జగన్మోహనాకారుఁ - గనుఁగొని బాణంబు గని యేను బెదరి
యన్నదీజలములు నప్పుడు తెచ్చి - కన్నులు దుడిచి యంగము లెల్లఁ దుడిచి
“యక్కట! మునినాథ! యడరి నాశరము - దిక్కఱి దాఁకి వధించెనే నిన్ను?
నీనదీజలముల కేల విచ్చేసి? - తే నింక నీపాప మేమిటఁ గడత ?"
ననుచుండఁ దనకన్ను లల్లన విచ్చి - ననుఁ జూచి తనుఁ జూచి నాభీతిఁ జూచి1170
"నీ వేమి సేయుదు? నీ కేల వగవ? - నీ వెవ్వఁడవు నాకు నికృతి గావింప?
దైవయోగంబున ధరణీశ! నాకు - నీవిధి యయ్యె నీ కేల శోకింప
నేనుఁగు ననుబుద్ధి నేసితి గాని - పూని నాదెసఁ గోపమున నేయ వీవు;
ఏను బ్రాహ్మణుఁడఁ గా నెలమి వైశ్యునకు - భూనాథ! శూద్రికిఁ బుట్టినవాఁడ;
నటుగాన నిది బ్రహ్మహత్యయుఁ గాదు - పటుదోషఫలము నిన్ బ్రాపింపలేదు
నరనాథ! తలఁకకు నాచావుఁ జూచి - యరిగి నాగురు లున్నయచటికిఁ బోయి
నాచావుఁ జెప్పకున్నను యోగదృష్టిఁ - జూచి భావించి యచ్చుగఁ గాంచిరేని
కోపించి నన్గన్నగురులు నిన్ బట్టి - శాపింప రఘుకులక్షయము గాఁగలదు.
భూపాల! యీకొండపొంతఁ బశ్చిమపుఁ - గోపున నొకమఱ్ఱి కొమరొందుచుండు
నావటవృక్షకోటరమందు రేయి - కావడి ఘటియించి కడుసంతసమున1180