పుట:Ranganatha Ramayanamu.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దలవంచుకొని యుండె దశరథుం డంత - నలయుచు నపు డయోధ్యాపురిఁ జొచ్చి
పాడువాఱినయట్టి పట్టణవీథి - నాడాడ నిలుచుచు నడలు కౌసల్య
నగ రంతఁ జొచ్చి యాననధూళితోడఁ - బొగులుచు సెజ్జపైఁ బొరలుచు మిగుల
నలయుచు సొలయుచు నసురుసు రనుచు - నలుదెస ల్చూచుచు నాలుక యెండ
హారామ! హారామ ! యనుచు దైవంబు - దూఱుచుఁ దనుఁ దానె దూషించుకొనుచు
"నేపాటు నేదుఃఖ మెఱుఁగనియట్టి - నాపుత్రరత్నంబు నాదుకోడలును
ఎంతద వ్వరిగిరో? యెం దున్నవారొ? - యెంతతోఁ గుంది వా రెట్టు లేగెదరొ?
కందమూలములు శాకములు నేరీతిఁ - దిందురో? యెట్లు వర్తింతురో యడవి?”940
నని యని వారల యాయాసములకుఁ - దనమది నడలుచుఁ దలపోయుచుండెఁ.
గౌసల్యయును నంతకంటె శోకింప - నాసుమిత్రాదేవి యడలార్పుచుండె,
నంత రాముఁడు పౌరు లందఱు గొలువఁ - గొంతద వ్వేగి పేర్కొని వారిఁ బలికె.
"ననఘాతులార! మీ రందఱు మగుడి - చనుఁ డయోధ్యకు నాకు జయము గోరుండు,
భరతునియాజ్ఞలోపలను వర్తించి - పొరయుఁడు సౌఖ్యముల్ పొందు మీ" కనిన
వార లందఱు నేకవాక్యులై పలికి - రోరామ యిట్టాడ నుచితమే నీకు?
భరతుఁ డేటికి మాకుఁ? బట్టణం బేల? - వరమందిరము లేల? వాహనము లేల?
యుప్పరిగలు నేల? యువిదలు నేల? - చప్పరములు నేల? సౌధంబు లేల?
మేడలు మా కేల? మేలమైనట్టి - వాడలు మా కేల? వలదు నీ వరుగ
వత్తుము నీవెంట వలదంటివేని - చత్తుము దీనికై సందేహ మేల?"950
అని యిటు పలుకుచు నఖిలభూప్రజలు - తనుఁ గొల్చిరా రఘూత్తముఁడు నాఁ డేగి
తమసానదీతటస్థలమున విడిచి - తమసలో సాంధ్యకృత్యము లెల్లఁ దీర్చి
తగుసౌధమున మృదుతల్పంబునందు - మొగిఁ బవ్వళించు నామోహనమూర్తి
తరుమూలమునఁ బర్ణతల్పంబునందు - ధరణీసుతయుఁ దానుఁ దగ విశ్రమించెఁ
దనచుట్టుపౌరులు తమయిండ్లు మఱచి - తనయుల భార్యలఁ దగులుఁ బోవిడిచి
వనములఁ దమవెంట వచ్చువా రనుచు - నినుపార దప్పితో నిద్రింపఁ జూచి
వారల మగుడించు వలనొండులేక - నారాత్రిమధ్యంబునందు సుమంతుఁ
దే రాయితము సేసి తెమ్మని పలికి - పౌరుల వంచించు భావ మాతనికిఁ
దెలిపి యయోధ్యకై తెరువుఁ బోనిచ్చి - తలకొని మగుడించి తమస దాఁటించి
తృణశిలావృతభూమి తెరువుఁ దోలించి - గణుతింపరానివేగమునఁ బోవుచును960
దమరాకయును మహీధవునిచేఁతయును - దమకించి మదిలోనఁ దాపంబు నొంది
తెరువుపల్లెలవారు ధృతి దూలి యేడ్వఁ - బరుసంపుటెలుఁగుల పలుమాఱు వినుచు
వనతరు ల్సీతకు వరుసఁ జూపుచును - ఇనకులమణియైన యిక్ష్వాకునకును
మనువు ము న్నొసఁగినమహిమఁ గన్గొనుచుఁ - జని వేగవతి దాఁటి సరయువు దాఁటి