పుట:Ranganatha Ramayanamu.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నరనాథుఁ డమ్మఱునాఁడు మాపటికిఁ - గరము వేగమున గంగానదిఁ జేరి
తడయక హింగుదీతరుసమీపమున - విడిసి యచ్చటఁ బ్రీతి విశ్రాంతి నొందె.
నారయ దమసలో నట నిద్రవోయి - పౌరు లందఱును బ్రభాతంబునందుఁ
గరమర్థితో మేలుకని నాల్గుదెసలఁ - బరికించి నివ్వెఱపడి శోకమునను
రామునిఁ గానక రథముచొ ప్పరసి - రాముఁ డయోధ్యాపురమున కీరాత్రి
యవనినాథుఁడు పిల్వ నంపిన మరల - భువనభారముఁ బూనఁ బోనోపు ననుచు970
నని యయోధ్యకు వచ్చి యచ్చోట రాముఁ - గనుఁగొనఁజాలక ఘనశోకవహ్ని
ననయంబుఁ బొగులుచు నకట! రాఘవుఁడు - మనల వంచించి క్రమ్మఱఁ బోయె ననుచు
నారామకృపయు సత్యంబు ధర్మంబు - చారువర్తనము నిచ్చలు నుతించుచును
నితరవస్తువులపై నిచ్చలు మాని - యతనిఁ దలంచుచు నతనిఁ బాయుటకు
నంతరంగంబున నలయుచునుండ; - నంత నక్కడ గుహుం డను చెంచురాజు

శ్రీరాములు గుహునిఁ జూచుట

శృంగిబేరం బేలు చిరపుణ్యశాలి - గంగాతటమున రాఘవుఁ డుండు టెఱిఁగి
చనుదెంచి రామలక్ష్మణులకు మ్రొక్కి - వనమూలఫలములు వలయువస్తువులు
కనకాంబరాదులు కానుక లిచ్చి - వినయవిధేయుఁడై వినుతు లొనర్చి
యచ్చెరువుగ రాము నాకృతిఁ జూచి - యిచ్చలో వెఱగంది "యిది యేమి దేవ!
నీ వరణ్యములకు నిఖిలంబు విడిచి - యీవిధి విచ్చేయు టేమి కారణము?980
నలినాప్తకులనాథ! నాయట్టిబంటు - కలుగ నీవేషంబు గలిగెనే మీకు?
చెనఁటియై మి మ్మిట్లు చేసిననీచు - ననిఁ బట్టి చంపెద" ననిన రాఘవుఁడు
నతనిసద్భక్తికి నతనిశక్తికిని - నతనిధీరోక్తుల కానంద మంది,
యతనిఁ గౌఁగిటఁ జేర్చి యాదరం బెసఁగ - నతనితోఁ దనదువృత్తాంతంబుఁ దెలుప
నంతయు విని గుహుం డాత్మలోఁ బెద్ద - చింతించి కైకేయిసేతకు వగచి .
దశరథునేరమి తలపోసి పోసి - దశరథాత్మజుల దుర్దశకు శోకించె
రాముఁ డప్పుడు కృపారసమగ్నుఁ డగుచు - సౌమిత్రియును దాను సముచితఫణితి
గుహుశోక ముడుప నర్కుఁడు గ్రుంకుటయును - విహితసంధ్యాకాలవిధు లొప్పఁ దీర్చి
గంగోదకముల నాఁకలి దీర్చి సూత - శృంగిబేరాధిపు ల్చేరి సేవింప
ధరణీతనూజయుఁ దాను లక్ష్మణుఁడు - ధరణిపైఁ దృణశయ్యఁ దగ విశ్రమించె.990
శరచాపహస్తుఁడై సౌమిత్రి యంతఁ గర మొప్పఁ - దమయన్నఁ గాతునన్బుద్ధిఁ
బదునాలుగేండ్లును బగలును రేయు - నిదురవోవకయుండ నియమంబు చేసి
తమయన్నసెజ్జకు దవ్వుల నిలిచి - యమలమానసుఁ డప్పు డటు కొల్చియుండె
నారాత్రి నిద్ర మాయారూపు దాల్చి - ధీరుఁ డాలక్ష్మణదేవునిఁ జేరి.