పుట:Ranganatha Ramayanamu.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నతిమృదుగాత్రి యీయతివ భూపుత్రి - పతిఁ బాయలే దని ప్రణుతించువారు;
ఈసుతుఁ బాయంగ నెట్లోర్చె నట్టి - కౌసల్య మది యెంత గట్టనువారు;
నై రామునరదంబు నందందఁ గదిసి - భూరిశోకాగ్నులఁ బొగులుచుఁ బోవ
నంతఁ గౌసల్యయు నాసుమిత్రయును - జింతాపరంపరఁ జిక్కి శోకించి
వారితరంబులు వలనొప్ప నూఁది - వారిపై వ్రాలుచు వగలఁ దూలుచును
గలయ నంతఃపురకాంతలు దన్నుఁ - గొలిచి రాదశరథక్షోణిపాలకుఁడు
భూరిలోచనబాష్పపూరముల్ దొరుఁగ - "హారామ! హారామ!" యని పలుమాఱు
నెలుఁగెత్తి యేడ్చుచు నేచినవగల - నలిఁ దూలి పొగులుచు నగరంబు వెడలె
అప్పుడు రవిదీప్తు లణఁగె; నల్దెసల - నుప్పొంగెఁ దమము; వహ్నులు మండవయ్యె;910
ధరణి బీటలు వాఱెఁ; దారలు రాలె; - వికసించి గ్రహములు వినువీథిఁ బాఱె;
నెలమిమై మదధార లింకె దంతులకుఁ; - గలయ నశ్వములకుఁ గన్నీరు దొరఁగె;
నావులు చన్నియ్య వయ్యెఁ గ్రేపులకు! నావీడు కడుశూన్య మై తోఁచెఁ బ్రజకు;
వారు వీరన కెల్లవారు నెల్లెడలఁ - బౌరులయేడ్పు లంబర మెల్ల నిండె;
సురవరకామినీశోకారవములు - పొరిఁబొరి వినవచ్చెఁ బురజనంబులకు;
నప్పుడు దశరథుఁ డారామురథము - చొప్పు బాష్పములు చేఁజూడఁ జొప్పడక
"చంద్రబింబము తోఁచు సరియైనరామ - చంద్రునిమొగ మొకసారి చూచెదను,

దశరథుఁడు రథము నిల్పుమని సుమంతునిఁ బిలుచుట

ఓసుమంత్రుఁడ! రథ మునుపవే" యనుచు - నాసుమంతుఁడు విననట్లు చీఱుచును
వెనుకొని పురిదాఁటి వెక నేగుదెంచు - మనుజేశుఁ జూచి సుమంత్రుతో ననియె
“నిదె వచ్చుచున్నవాఁ డినకులేశ్వరుఁడు - పొదపొద పోనిమ్ము పోనిమ్ము రథము"920
అని యని రఘురాముఁ డందందఁ దఱుమ - మొనసి యాతఁడు రయంబునఁ దేఱుఁ బఱపె
నంత వసిష్ఠుఁ డయ్యవనీశుఁ జూచి - యంతరంగంబున నడలుచుఁ బలికెఁ
“ననఘ, శోకించుచు ననుపఁగా రాదు - మనుజేశ! నీ వింక మరలు మిచ్చోట"
ననవుడు దశరథుఁ డటుపోక నిలిచి - తనసూను రథమును దప్పక చూచి
యదియుఁ గానక ధూళి నటు చూచి చూచి - యదియుఁ గానక బయ లటు చూచి చూచి.
హా! యని యెలుగెత్తి హా రామ! రామ హా! యని మూర్ఛిల్లి యవనిపైఁ ద్రెళ్లి,
పొరలుచుఁ గెంధూళిఁ బృథ్వి కంపింపఁ - గర ముగ్రమగుదృష్టిఁ గైకేయిఁ జూచి
"నీపాప మెఱుఁగక నిన్ను మన్నించి - నాపుణ్యపుత్రరత్నముఁ గోలుపోతి
నిన్ను బెండ్లాడి నే నీచుఁడ నైతి - నన్నిట మేటినై యల్పుండ నైతి930
నడరునిందల కెల్ల నాధార మైతిఁ - గడపటఁ జెఱిచితిఁ గాకుత్స్థకులము
వినుఁ జూడఁగారాదు నిను ముట్టరాదు - చెనఁటి నీతోన భాషింపఁగారాదు”
అని దశరథుఁ డాడ నాపౌరజనులుఁ - గనుఁగొని తనుఁ దిట్టఁ గైకేయి వినుచుఁ