పుట:Ranganatha Ramayanamu.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ననుఁ గొల్వవత్తురే? నరనాథునందు - చనవు లేకుండెడుచందంబుఁ జూచి.
వాసియు వన్నెయు వైభవం బెడలి - యీసవతులలోన నెట్లు వర్తింతుఁ?
గైకరాజసము నేకరణి సహింతు - నీకార్య మిట్లాట నెఱుఁగలే నైతి;
వీనుల నీవార్త వినుటకు మున్నె - యే నేల చావనో యినవంశతిలక!
కడఁగి యీరాజ్యంబు గైకొని కైక - కొడుకు పట్టము గట్టుకొని యేలుఁగాక
భూరిదుర్గములకుఁ బోవ నేమిటికి? - యూరకె నాయొద్ద నుండవే తండ్రి!
యావసిష్ఠాదిసంయములు బాల్యమున - భావించి చూచి నీపాదపద్మములు
జలజాతహలకులిశధ్వజకలశ - ములు మొదలగు చిహ్నములు విలోకించి
యీవిశ్వ మంతయు నితఁ డేలు ననిరి - యావార్తఁ గైక నేఁ డనృతంబు చేసె"440
నని పెక్కుతెఱఁగుల నడలు కౌసల్యఁ - గని లక్ష్మణుండు శోకము కోప మెసఁగ
ముడివడుబొమలతో మొగము కెంపెసఁగ - నుడుగక దోషాగ్ను లొగి మండుచుండ
రాముమాతను జూచి రామునిఁ జూచి - సౌమిత్రి యడిదంబు జళిపించి పలికె.

లక్ష్మణుని కోపము – రాముని యోదార్పు

"మగఁటిమి దిగనాడి మానంబు విడిచి - తగు నుత్తమక్షత్రధర్మంబు వదలి
వాలినతేజంబు వమ్ముగాఁ జేసి - యేల యీ దీనోక్తు లిట్లాడ నీకు?
నక్కటా! వీతజ్ఞుఁ డగు తండ్రిపనుపు - స్రుక్కగ ధిక్కరించుట కాదుకాక;
కామాతురుఁడు పాపకరుండు వృద్ధుఁ - డేమిటి కీరాజు నింత పాటింపఁ?
గైకేయి కిచ్చి బొంకఁగనేర ననుచు - నీ కిచ్చియోడక నేఁ డెట్లు బొంకె?
నడరి వసిష్ఠాదు లందఱు వినఁగ - కడఁగి నిన్ బట్టంబు గట్టెద నన్న
పలుకు సత్యంబుగాఁ బాటింపవలదె? - తలఁపంగ నది యసత్యము గాదె తొలుత?450
నెక్కడి దశరథుం? డెక్కడివరము? - లెక్కడి భరతుండు? నెక్కడి కైక?
విను మేను నిజముగా విల్లెక్కుపెట్టి - కొనియున్న నన్ను మార్కొన నెవ్వఁ డోపు?
భరతుని మొదలుగాఁ బగవారిఁ జంపి - నెరసి యీపురమెల్ల నీఱు గావింతు;
హరిహరబ్రహ్మాదు లడ్డమై రేని - తరమిడి తోలి యుద్ధము సేయువాఁడఁ,
గమనీయకేయూరకంకణాలంకృతములు - మనోజ్ఞచందనచర్చితములు
నగునాభుజముల నభిషిక్తుఁ జేసి - పగతురఁ జంపుదుఁ బాల్పడి యిపుడె;
పాటింప నావంటి బంటు గల్గియును - నేటికి సామ్రాజ్య మెల్ల వర్జింప
నడవుల కేఁగెద ననునట్టిబుద్ధి - విడిచి కౌసల్యకు వేడ్క లుప్పొంగ
నెట్టనఁ గడిమిమై నిజశక్తి మెఱసి - పట్టంబుఁ బూనుచుఁ బ్రజఁల బాలింపు;"
మనవుడు రాఘవుం డనుజన్ముఁ జూచి - మనమునఁ దలపోసి మమత నిట్లనియె.460
"సౌమిత్రి! శూరత సమయంబు గాదు - ఈమాట మెచ్చదు హితబుద్ధి నిలువు
చాలు చా లీపట్ల జగము లేలఁగను - పోలంగ మన కబ్బెఁ బొసఁగు కార్యములు