పుట:Ranganatha Ramayanamu.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గొడుకుఁ బట్టముఁగట్టఁ గోరె నొక్కటికి - అడవికి ననుఁ బంప నడిగె నొక్కటికి.

కౌసల్య శ్రీరాముని యరణ్యవాసమునకై శోకించుట

నడిగిన దశరథుఁ డధికశోకమునఁ - బడుటయు మాతండ్రిపలుకు రక్షింప
నడవులఁ బదునాలుగబ్దంబు లుండ- గడఁగి వచ్చితి” ననఁ గౌసల్య మదిని
గలఁగి నివ్వెఱగంది కడుఁజిన్నవోయి - పలుకనేరక మ్రానుపడి యుస్సు రనుచు
ముడిగొన్ననగలతో మొదలంటఁ ద్రవ్వి - పడియున్నలతఁబోలెఁ బడి మూర్ఛవోయె
నడలుచు రఘురాముఁ డప్పు డాతల్లి - యెడ నతిభక్తితో నెత్తి నెమ్మేన
గమియ నంటినధూళి గరములఁ దుడిచి - కొమరారు గద్దియఁ గూర్చుండ నునిచి
శ్రమము దీఱంగ లక్ష్మణుఁడును దాను - సముచితగతి నుపచారముల్ సేయ
నొదవినవగలతో నొయ్యనఁ దెలిసి - పెదవులు దడపుచు బింబోష్ఠి పలికె.
ననఘ! రాఘవ! నిన్ను నడవుల నుండు - మను పల్కు విన నెందు నరుదు వీనులకు410
పెలుచ నొక్కట నిన్నుఁ బిలుపించి యట్లు - పలుక నెమ్మెయిఁ జాలెఁ బార్థివేశ్వరుఁడు?
ధరణి కింతటికిని దగు రాజు గాఁగ - భరతుఁ బట్టము గట్టి పతి సేయుఁ గాక;
కడుఁగృపశూన్యుఁడై కాకుత్స్థతిలకుఁ - డడవికి నిన్నుఁ బొమ్మనకున్ననేమి?
యవివేకిగా నొండె యధముఁడు గాఁడు - సవతిమాటలు వినఁ జనునయ్య! తనకు?
నిది ధర్మ మిది కార్య మిది లెస్స యనుచు - మది కెక్కుహితులైన మఱి మంత్రులైనఁ
గులగురుఁడైన లోకులు మెచ్చ రతనిఁ - దెలుపలేరై రి నీదెస మైత్రిఁ గూడి;
యింతనేరము చేసె నెన్నఁడు నాథుఁ - డింతపాపముఁ జేసె నెన్నఁడు కైక;
యడవుల నుండు పొ మ్మని నిన్నుఁ జూచి - నుడువఁగఁ గైకకు నో రెట్టు లాడె?
ననువునఁ జేరి ప్రాణములైన నడుగు - జననాథునకుఁ దాను చనవురాలైనఁ
గైకకుఁ బుట్టి లోకము లేల కీవు నా కేల పుట్టితి నారామచంద్ర?420
నీవు నాకడుపున నిటఁ బుట్టకున్న - నీవిషాదము నాకు నేల పాటిల్లు?
గొడుకులు లేని యాగొడ్రాలికంటెఁ - గడలేనిశోకంబు గలిగె నాకకట!
పెద్దకాలమునకు బిడ్డలు లేక - తద్దయుఁ బ్రీతి నిన్ దనయుఁగాఁ గాంచి
యూఱడియుండుచో నుండలేదయ్య! - నాఱడి చెడిపోయె నకట! నాతపము
నరనాథనందన! నను డించి నీవు - కరముతెంపున ఘోరకాంతారములకు
నరిగినప్పుడె నాకు నారసిచూడ - మరణంబు దప్పించి మఱియొండు లేదు
న న్నెట్లు విడిచి కానల కేగె దింక? - నన్న నేనేమిట నడలార్చుకొందు?
నెలమిమై నిరువదియేనువత్సరము - లలరి పెంచితి నిన్ను నఖిలంబు నెఱుఁగ;
నట్టిన న్నిట డించి యెట్టు పోయెదవు? - పట్టి! నీకొఱకునై పాలించినట్టి
వివిధవ్రతంబులు వివిధదానములు - చవుట విత్తనములు చల్లినట్లయ్యె;430
భరతుండు రాజైనఁ బరివారజనులు - కరుణమాలినయట్టికైకకు వెఱచి