పుట:Ranganatha Ramayanamu.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నని పల్కి కన్నుల నందందఁ గ్రమ్ము - ఘనబాష్పపూరముల్ కరములఁ దుడిచి
"లేమ! నీ వొకదిక్కు లేనిచందమున - భూమిపై నిట ధూళిఁ బొరల నేమిటికి?
గాము సోఁకెనొ యొండుఘనమైనరోగ - మేమి పాటిల్లెనో యెఱిఁగింపు నాకు;
వెజ్జులు వచ్చిన వేగ మాన్పెదరు - లజ్జింప నేటికి లలితాంగి! నీకు
నటుఁగాన నీతలం పైన నొం డరయ - నిటు సేయు మని పల్కు మేను జేసెదను.
వనిత! నీకొఱకు నవధ్యులు గాని - యనఘచరిత్రుల నైనఁ జంపెదను.
జంపంగఁ దగిన దుర్జనకోటి నైనఁ - గంపించి నీమాటఁ గాచి పుచ్చెదను.
నీకుఁ బ్రియం బైన నిరుపేద నైనఁ - జేకొని రాజుగాఁ జేసెద నెలమి.
భామిని! నీదయఁ బాసినయట్టి - శ్రీమంతు నైన దరిద్రుఁ జేసెదను.
నేను నావారు నీహితబుద్ధి నడువఁ - గా నీకు నిట్లుండఁ గారణ మేమి?220
లేమ! నామాట లాలించి నీ విపుడు - మో మెత్తి నామది ముచ్చటదీర,
నడిగిన నాప్రాణ మైన నీ కిత్తు - నడుగుము నీ" వన్న నానంద మంది
యన్నాతి విభుని నెయ్యంబు నెఱింగి - సన్నపుటెలుఁగున జననాథు కనియె.
“దేవ! నీచెప్పినతెఱఁగున నీవు - గావింతునని బాస గావింతు వేని
మఱి యెఱింగింతు నమ్మాట నీ" కనినఁ - దెఱవతో దశరథాధిపుఁ డిట్టు లనియె.
"వీరుఁ డెవ్వఁడు మేటివిలుకాండ్రలోన - సార మెవ్వఁడు ధర్మసమితిలో నెల్ల
నెవ్వనిఁ జూడక నే నుండఁజాల? - నెవ్వఁడు నను భక్తి నేప్రొద్దుఁ గొలుచు,
నట్టి రాఘవునితో డతివ! నీకోర్కి - నెట్టనఁ గావింతు నే" నన్న నలరి
మరుదగ్నిశశినభోమణిముఖ్యులైన - సురల వేర్వేఱు సాక్షులుగా నొనర్చి230
ధరణీశుమదిలోని తమకంబు దెలిసి - కరుణను నెడఁబాసి కైకేయి పలికె,
“నొలసి దేవాసురయుద్ధంబునందు - వలనొప్ప నిచ్చితి వరములు రెండు
భూవర! మఱచితే బుద్ధిఁ జింతింపు - మావరద్వయము ని న్నడిగెద నిపుడు
నాదిత్యకులజుండ వగు మహారాజు - వాదిరాజులకంటె నధికపుణ్యుఁడవు.

కైక దశరథుని వరముల నడుగుట

తప్పాడ వాడినఁ దప్పవు నాకుఁ - దప్పక వరములు దయ నిచ్చితేని?
ధరణి కంతటికిని దగ రాజు గాఁగ - భరతుఁ బట్టముగట్టఁ బనుపు మొక్కటికి
పరఁగఁ దాపసవృత్తిఁ బదునాలుగేండ్లు - నురుదుర్గములు రాము నునుపు మొక్కనిని"
నని పల్క నిర్ఘాతమై వచ్చి చెవుల - గొనకాడ మూర్ఛిలి కుంభిని ద్రెళ్ళి
పెలుకురి భూపతి పెద్దప్రొద్దునకు - తెలివొంది కైకేయిదెసఁ జూచి పలికె.
"కోమలి! కేకయకులమునఁ బుట్టి - యీమాట లాడ నో రె ట్లాడె నీకు?240
నడవులపాలు గ మ్మని రాముఁ ద్రోవ - నెడపక తొల్లి నీ కె గ్గేమి చేసెఁ
గౌసల్యకంటె నిన్ ఘనతగాఁ జూచు - నీసేవ లొనరించు నీపంపు సేయు.