పుట:Ranganatha Ramayanamu.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మలినవస్త్రము గట్టి మది నల్క దొట్టి - చలము చేపట్టి భూస్థలిఁ బండె నంతఁ.
దనలోన నూహించి తనుఁ గొల్చి వచ్చి - మనమార నున్న యామంథరఁ జూచి
"జననాయకుఁడు రామచంద్రునిఁ బిలిచి - వనమున మునివృత్తి వర్తింపఁ బనిచి
భరతుని దగురాజ్యపదమునకెల్లఁ - గరమర్థిఁ బట్టంబు కట్టినఁ గాని,
యన్నపానము లొల్ల నాభరణము - లెన్ని యిచ్చిన నొల్ల నేమియు నొల్ల
నిట లేచి రానింక నే" నంచు నలుక - నటు పూని మదిలోన నలయుచున్నంతఁ.

దశరథుఁడు కైకయింటి కరుగుట

గైకేయితోడ రాఘవుని పట్టాభి - షేకోత్సవం బెల్లఁ జెప్పెద ననుచు
నారాత్రి దశరథుఁ డచటి కేతెంచి - చారుమాణిక్యకాంచనధగద్ధగిత
కనకరత్నకవాటకక్ష్యాంతరములు - ఘనసారచందనకర్పూరగంధ
కలితనానారత్నకాంతిశోభితముఁ - దులకించు సౌధవేదుల వేగ కడచి190
కేళీగృహంబునఁ గేకయపుత్త్రిఁ - బోలంగఁ బరికించి పొడగాన కపుడు
దౌవారికునిఁ జూచి దశరథుఁ డడుగఁ - గా వాఁడు వగచుచుఁ గరములు మొగిచి
“దేవ యాకోపమందిరములోపలికి - దేవి విచ్చేసె నేతెఱఁగొకో? యెఱుఁగ,”
నని వాఁడు పల్కిన నామాటలకును - ధనురుగ్రటంకారదారుణం బగుచు
వీనులఁ బడి మోము వెలవెలఁ బాఱి - మానవాధీశుండు మానసంబునను
బ్రేమానుబంధంబు ప్రీతి రెట్టింప - నామందిరంబున కల్లన వచ్చి
యనిమిషపురినుండి యచ్చరలేమ - చనుదెంచి పడియున్నచందంబు దోఁప
నూరకే ధరణిపై నున్న యావికచ - నీరజాననఁ జూచి నివ్వెఱగంది
వెరవెరపాటున వేదనఁబొంది - తెఱవ దగ్గరఁ జేరి దీనుఁడై మీఱి
యాయింతియెడలెల్ల నంటి చూచుచును - గాయజవివశుఁడై కడువేఁడఁదొడఁగె200
"నిందీవరాక్షి! పూర్ణేందునిభాస్య! - ఇందిందిరాలక యేల యీయలుక!
పవళింప నేలనే బాలేందుఫాల? - యవిరళమృదులపర్యంకంబు లుండఁ
గోమలమృదులదుకూలంబు లుండ - నీమైలచీర నీ వేల కట్టితివి?
పసిఁడిశలాకతోఁ బ్రతియైనమేనఁ - బొసఁగ భూషణములఁ బూన వేమిటికిఁ?
జలపట్టి వెన్నెలచందమౌ నుదుటఁ - దలపట్టు లేల? నీతలఁ పెట్టు పుట్టె?
నీలాలకంబుల నిగ్గులుదేర - నేల పాపట దీర్ప విన్నాళ్ళరీతిఁ?
గెమ్మోవి కినుమడి కెంపు సంధిల్లఁ - గమ్మతమ్మల మేల గైకోవు బాల!
జిలుఁగువన్నెలతేటచిఱునవ్వుమొలక - మొలపింప వేటికి ముఖచంద్రునందు?
నిది యేమి కైక! నీ విటు చిన్నవోయి - మది దూలి నీ కింత మరుగ నేమిటికి?
నెవ్వరు నీదెస నెగ్గులు పలికి - రెవ్వరు మాటాడి రెదిరి నీతోడ?210
వారి నెఱింగింపు వారిజనయన! - వారి వారింతు నెవ్వారల నైన”