పుట:Ranganatha Ramayanamu.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నటువంటి సుగుణాఢ్యుఁ డైన శ్రీరాము - నెటువలెఁ బొమ్మంటివే దయమాలి?
అడవుల కతని నీ వంపు మటన్న - నెడ చూచి చూచి నే నెటులఁ బొమ్మందు?
నామహాత్ముని రాము నడవుల కనిచి - యీమేనఁ బ్రాణంబు లెట్లు నిల్పుదును
నృపపుత్రి వని నిన్ను నెమ్మిఁ గైకొంటి - చపలలోచన! కాలసర్పంబ వైతి.
నారాజ్యమైనఁ బ్రాణము లైన నిత్తు - నారాము విడిచి పొమ్మని పల్కఁజాల,
నను వృద్దు దీను ననాథు దుర్బలుని - మనికి తప్పడకుండ మగువ రక్షింపు;
చక్కఁగా నీపాదజలజంబులకును - మ్రొక్కెద నేను రాముని నదాటమునఁ
జెలువ! యీపాపంబు సేయఁ జింతింప - వల” దనఁ గోపించి వామాక్షి పలికె.250
‘‘రాజేంద్ర! సత్యపరాక్రమస్ఫూర్తి - పూజితకీర్తివై బొంకంగఁదగునె?
ఇట్టిదేవత లంద రెఱుఁగంగ నొట్టు - పెట్టి తప్పెద వెట్టి పృథివిపాలుఁడవు?
ఒకగువ్వకై తనయొడలిమాంసంబు - నొకడేగకును శిబి యొసఁగఁడె మున్ను
క్షోణిదేవున కలర్కుం డనురాజు - త్రాణతో నొసఁగఁడె తనలోచనములు?
చెలరేఁగి జలధియుఁ జెలియలికట్ట - బలిమి దాఁటక లోను బడియుండలేదె?
యది యటులుండె నీయన్వయభవులు - మదిలోన నవ్వులమాటలకైన
కలలోన బొంక రిక్ష్వాకుండ వయ్యు - వెలయఁ గౌసల్యకు వెఱచి బొంకెదవు.
బొంకెడువాఁ డొక్కపురుషుఁడే యనుచు - బొంకితి ననుఁ బొంద బుద్ధిగా దింక
విచ్చలవిడి నేను విష మైన మ్రింగి - చచ్చెద నటమీఁదఁ జంపింపు భరతుఁ
బావనుఁ డగు రాముఁ బట్టంబు గట్టు - నీవు కౌసల్యయు నెమ్మదినుండు”260
మని పల్కుటయు శోక మాత్మ రెట్టింప - జననాథుఁ డెంతయు సంతాప మంది
వెలవెలఁబోయి వివేకహీనతను - గలిగి యాకైకతోఁ గ్రమ్మఱఁ బలికె.
“యేల కైకేయి నీ కిట్టిపాపంబు - బాలిశత్వంబును బ్రాపించె మదిని?
నన్న యుండఁగఁ దమ్ముఁ డవినీతితోడ - ని న్నేల నేలునే? యిన్నియు నేల?
నీకుమారుఁడు ధర్మనిరతుండు భరతుఁ - డీకలుషోక్తికి నె ట్లొడిగట్టు?
మాకులాగత మైన మర్యాదఁ దలఁపు - శోకార్తు ననుఁ దెగఁజూడక మనుపు
మెప్పుడు నిల్లాలు హితవు భక్తియును - దప్పక సఖిరీతిఁ దల్లిచందమున
దాసివైఖరి సహోదరితెఱుంగునను - నాసేవ లొనరించు నానావిధమున
నట్టి కౌసల్య మోహపుఁబట్టిఁ బాసి - పట్టినధృతి నెట్లు ప్రాణము ల్పట్టు?
సౌదామినీలతాసంకాశదేహ - వైదేహి యేరీతి వగల వేగించు?270
నాసుమిత్రాపుత్రుఁ డతనితల్లియును - ఈసొద విని శోక మెట్లణంచెదరు?
శ్రీరాముపట్టాభిషేకంబు గోరి - పౌరులందఱు వేడ్కఁ బడియుండుచోట
నారాము నడవుల కనిచితినేని? - ధీరాత్మకులు నన్నుఁ దిట్టకుండుదురె?
కావున నెల్లలోకములకుఁ గీడు - గావించి యేసౌఖ్యగతు లందె దీవు?