పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మరల సదా మనుష్యులతో నిండి మునుపటికింటెను సమ్మర్దము గలిగి బహుజనధ్వనులతో మాఱుమ్రోయుచుండెను. మునుపు మనసులో నొకటి యుంచుకొని పయి కొకటి చెప్పుచుఁ గపటముగాఁ బ్రవర్తించువారితోను బట్ట యిమ్మని కూడు పెట్టుమని యాచించు దరిద్రులతోను నిండి యుండెను గాని యిప్పుడు మనసులో నున్న దానినే నిర్భయముగా మొగముమీఁద ననెడు ఋజువర్తనము గలవారి తోను బట్టలను భోజనపదార్థములు గొన్నందునకయి యీవలసిన సొమ్మిమ్మని యధికారమును జూప భాగ్యవంతులతోను నిండియుండ నారంభించెను. గృహమునకు మనుష్యసమృద్ధి గలిగినట్టుగానే రాజశేఖరుఁడుగారికి వస్తుసమృద్ధియు నానాఁటి కధికముగాఁ గలుగనారం భించెను. మునుపటివలెఁ బగటిపూట యందు బదార్థసందర్శన మంతగాఁ కలుగకపోయినను, తదేక ధ్యానముతో నున్నందున రాత్రులు కలలయందు మాత్రము తొంటికంటె సహస్ర గుణాధిక ముగాఁ గలుగుచుండెను. ఆ బాధ లటుండఁగా మున్ను రుక్మిణి శిరోజు ములను తీయించక పోవుటయే బాగుగనున్నదని శ్లాఘించిన శ్రోత్రి యులే యిప్పడాతనినిఁ బలువిధముల దూషించుటయే కాక సభవారికి నూఱు రూపాయ లపరాధము సమర్పించుకోనియెడల శ్రీశంకరా చార్య గురుస్వామికి వ్రాసి జాతిలో నుండి వెలి వేయించెదమని బెదరింపఁజొచ్చిరి. ఋణప్రదాతలతో నిండియుండి యిల్లొక యడవిగా నున్నందునను, వీధిలోనికిఁబోయిన సుగుణములను సహితము దుర్గుణములనుగానే పలుకుచు హేళనచేయుచు మహాత్ములతో నిండి యుండి యూరొక మహాసముద్రముగా నున్నందునను గౌరవముతో బ్రతికినచోటనే మరల లాఘవముతో జీవనము చేయుటకంటె మరణ మయినను మేలుగాఁ గనఁబడి నందునను, ఏలాగునై నను ఋణ విముక్తి చేసికొని యూరువిడిచి మఱియొకచోటికిఁ బోవలె నని ఆయన నిశ్చయించుకొనెను. కాబట్టి వెంటనే రామశాస్త్రి యొద్దకుఁ బోయి యింటి తాకట్టుమీఁద నయిదు వందల రూపాయలను బదులు పుచ్చుకొని, సొమ్ము సంవత్సరమునాటికి వడ్డీతోఁగూడ దీర్చునట్టును,