పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భావుఁ డని దగ్గఱనున్న వారితోఁ జెప్పి నవ్వ మొదలుపెట్టిరి. ఈవఱ కును సీతను దనకొమారుని కిమ్మని నిర్బంధించుచు వచ్చిన దామోదరయ్య, ఇప్పు డాపిల్లను దన కొడుకునకుఁ జేసికోనని వారి వీరి ముందఱను బలుఁకజొచ్చెను. ఆ సంగతి కర్ణపరంపరచే రాజశేఖరుఁడుగారి వఱకును వచ్చినందున,ఆయన యొకదినము పోయి యడు గఁగా తా నీసంవత్సరము వివాహము చేయనని చెప్పెను.సుబ్రహ్మణ్య మంతటి యదృష్టవంతుఁడు లోకములో మఱి యెవ్వరునులేరని జాతకము వ్రాసిన సిద్ధాంతియే యాతనికిఁ గన్యనిచ్చెదనన్నవారి యింటికిఁ బోయి యాతనిది తాను జూచినవానిలోనెల్ల జబ్బుజాతకమనిచెప్పి పిల్ల నీకుండఁ జేసెను. రాజశేఖరుఁడుగారు ధనము లేక బాధపడుచుండియు నొరులనడుగుట కిష్టములేనివారయి యూరకుండగా, నిజమైనమిత్రుఁ డొకడైన నుండకపోవునాయని ఎంచి మాణిక్యాంబయు సుబ్రహ్మణ్యమును రాజశేఖరుఁడుగారికడకుఁబోయి నారాయణమూర్తినిగాని మఱి యెవ్వరి నైననుగాని బదులడిగి యేమాత్రమయిన సుబ్బమ్మ మాసిక మునకయి తెండని ప్రార్థించిరి. ఆయన వారిమాటను దీసివేయలేక దామోదరయ్యను నారాయణమూర్తిని మిత్రులవలె నటించి తనవలన లాభమును పొందిన మఱికొందఱిని బదు లడిగి చూచెనుగాని, ఆక్కఱ లేనప్పుడు వెనుక మేము బదులిచ్చెదము మేము బదులిచ్చెద మని యడుగనిదే పలుమాఱు సంతోషపూర్వకముగాఁ జెప్పుచు వచ్చిన వారు ఇప్పుడు నిజముగాఁ గావలసి వచ్చినది గనుక పోయి యడగినను వేయిక్షమార్పణలను జెప్పి విచారముతో లేదనిరి. పలువురు రాజశేఖరుఁడుగారి యింటికి వచ్చుట మానుకొన్నను, గొంత కాలమువఱకును గొందఱు వచ్చుచుండిరి. కాని తమ్మేమయిన ఋణ మడుగుదురేమో యని యిప్పు డావచ్చెడువారుకూడ రాకుండిరి. కాబట్టి మును పెప్పుడును మనుష్యులతో నిండియుండి రణగుణధ్వని గలిగియుండెడి రాజశేఖరుఁడుగారి గృహ మిప్పుడు త్రొక్కిచూచు వారులేక నిశ్శబ్దముగా నుండెను. అయిన నా స్థితియందది చిరకాల ముండినది కాదు; దాని స్తంభముహూర్త బలమెట్టిదో కాని తరువాత