పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గడుపునాటికి సొమ్మియ్యలేనిపక్షమున నిల్లాతనికిఁ గ్రయమగునట్టును పత్రమును వ్రాసియిచ్చెను.ఆ ప్రకారముగా సొమ్ము బదులు తెచ్చి దానిలో నాలుగువందల రూపాయలతో నన్నిటిని దీర్చి వేసెను. బదులిచ్చిన మఱుసటినాటినుండియు నిల్లు చోటుచేసి తన యధీనము చేయవలసినదని రామశాస్త్రి వర్తమానములు పంపుచుండెను.పూర్వము స్కాంధపురాణమును జదివినప్పటినుండియు రాజశేఖరుఁడుగారి మన సులో గాశీయాత్ర వెళ్ళవలెనని యుండెను. ఆ కోరిక యిప్పడీ విధముగా నెఱవేఱనున్నందునకు సంతోషించి, రాజశేఖరుడుగారు సకుటుంబముగా గంగాస్నానము చేసి వచ్చుటకు నిశ్చయించి తారా బలమును చంద్రబలమును బాగుగ నున్న యొక చరలగ్నమునందుఁ బ్రయాణమునకుఁ ముహూర్తము పెట్టి "ప్రతపన్నవమిపూర్వే" యని యుండుటచేత తిథిశూల లేకుండఁ జూచుకొని "నపూర్వేశని సోమేచ" యనుటచేత వారటాల తగులకుండ ఫాల్గుణ శుద్ధ త్రయోదశీ బుధ వారమునాడు మధ్యాహ్నము నాలుగు గడియల ప్రొద్దువేళ బయలు దేఱుటకు బండి నొకదానిని గుదిర్చి తెచ్చిరి. వారీవఱకు చేసిన యాత్ర లన్నియు గోదావరియొడ్డున నుండి యింటియొద్దకును, ఇంటి యొద్దనుండి గోదావరియొడ్డునకునే కాని యంతకన్న గొప్పయాత్ర లను జేసిన వారుకారు.

బండిని తెప్పించి వాకిటఁ గట్టిపెట్టించి ప్రయాణ ముహూర్తము మించిపోకమునుపే బండిలో వేయవలసిన వస్తువులను వేయ వలసినదని రాజశేఖరుఁడుగారు పలుమాఱు తొందరపెట్టినమీఁదట, మాణిక్యాంబ తెమలివచ్చి బండినిండను సుద్దతట్టలను బట్టలను చేఁద లను నింపి మఱియెుక బండికి గూడ జాలునన్నిటిని వీధిగుమ్మములో నుంచెను; బండిలో నెక్కవలసిన యిత్తడి పాత్రములను బట్టలపెట్టెలును లోపలనే యుండెను: ఇంతలో రాజశేఖరుడుగారు వచ్చి యాబుట్టలు మొదలగువానిని బండిలోనుండి దింపించి వారు వెళ్ళిపోవుచున్నారని విని చూడవచ్చిన బీదసాదలకు బంచిపెట్ట నారంభించిరి. ఆ వఱకు లోపలనుండి కదలి రాకపోయినను రాజ