పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆరవ ప్రకరణము


సొమ్ము పోయినందుకు మంత్రజ్ఞులు చేసిన తంతు__రుక్మిణి మగఁడు పోయిన వార్త నొకఁడు చెప్పుట__రుక్మిణికి రుగ్ణత వచ్చుట __సోదె యడుగుట__మగఁడు పట్టుట__భూతవైద్యము __ సువర్ణ విద్య__బైరాగి సొమ్ముతో నదృశ్యుఁడగుట.

మఱునాఁడు ప్రాతఃకాలమున రాజశేఖరుఁడుగారు దంతధావనము చేసికొనుచు వీధియరుగుమీఁద గూరుచుండి యుండఁగా సిద్ధాంతి తనతోఁగూడ మఱియొక బ్రాహ్మణునిఁ దీసికొనివచ్చి యరుగుమీద నొకప్రక్కను చతికిలఁబడెను. చేతిలో వెండిపొన్ను వేసిన చేపబెత్త మును పట్టుకొని, తలయును గడ్డమును గోళ్ళను బెంచుకొని కను బొమలసందున గొప్ప కుంకుమబొట్టు పెట్టుకొని గంభీరముగాఁ గూరు చున్న యీ విగ్రహమును నఖశిఖపర్యంతమును తేఱిపాఱ జూచి యాయన యెవరని రాజశేఖరుఁడుగారు సిద్ధాంతి నడిగిరి. "వీరు మహా మంత్రవేత్తలు; మళయాళమునందుఁ గొంతకాలముండి మంత్ర రహస్యముల నామూలాగ్రముగా గ్రహించినారు; వీరు కృష్ణాతీరమున నుండి యాత్రార్థమయి విజయంజేసినారు;వీరి పేరు హరిశాస్త్రులవారు; వీరీవఱకు బహుస్థలములలో పోయిన వస్తువులను నిమిషములో దెప్పించి యిచ్చినారు; వీరు నాలుగు సంవత్సరములనుండి వానప్రస్థా శ్రమమును స్వీకరించి యున్నారు" అని తా నాతనిని రెండుదినముల నుండియే యెఱిగినవాఁ డయినను జన్మదినమునుండియు నెఱిగి యున్న వానివలె నాతని చరిత్రమును చెప్పి, 'నఖలో మైర్వనాశ్రమీ యను దక్షస్మృతి వచనమును జదివి గోళ్లును,వెండ్రుకలను బెంచు కొనుటచే వానప్రస్థుఁడగునని తల్లక్షణమును జెప్పెను. అప్పుడు హరి శాస్త్రులు తన మంత్రసామర్థ్యమును గొంతసేపు పొగడుకొని తా