పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుగుళ్ళు తిరుగ నారంభించినాఁడఁట! వానికి సీత నియ్యను. మన శంకరయ్య జాతక మెట్లున్నది?

సిద్ధాంతి__మీ మేనల్లుని జాతకము చూచినాను. సమస్త విధములచేతను దివ్యజాతకమే కాని జన్మనక్షత్రము కృత్తిక. మన సీతది కూడ కృత్తికానక్షత్రమే--శ్లో అజైక ప్రాచ్చవిష్ఠాచ పునర్వస్వధ కృత్తికా: మృగశీర్షంచ విత్తాచసవితోత్తర ఫల్గుని జ్యేష్టాచ విశ్వతో యంచ నక్షత్త్ర క్యే నినస్యతి ఏకారాశౌ పృధగ్ధి ష్ణ్యేచోత్తమ మ్పాణి పీడనం॥__అని శాస్త్రములో పయి నక్షత్రముల యైక్యమునందు కన్యావరులకు నాశనము సంభవించునని చెప్పఁబడి యున్నది. బాపిరాజు కుమారుని జాతకము సర్వోత్తమముగా నున్నది.అందులో కేంద్రాధి పతికి త్రికోణాధిపతి సంబంధము కలిగియున్నది; ఇతరులయిన తృతీయ, షష్ణ, ఏకాదశ, అష్టమాధిపతులతోడి సంబంధము లేదు__శ్లో. కేంద్ర త్రికోణపతయస్సంబంధేన పరస్పరం ఇతరైరప్రసక్తాశ్చే ద్విశేష శుభదాయకా:॥ ఆని శాస్త్ర ప్రకార మతఁడు మిక్కిలి యదృష్ట వంతుఁడు. తక్కిన చిల్లర చేష్టలకు రూపమునకును నేమి? మఱు నాలు గేండ్లు పైబడిన యెంత బుద్ధిమంతుఁడగునో యెవరెఱుఁగుదురు? నా మాట విని చిన్నదానిని నాతని కిండి.

రాజ__నేను బాపిరాజకొడుకునకు పిల్ల నియ్యను. నా చెల్లెలు పోవునప్పడు తన కొడుకునకు సీత నిచ్చునట్లు నాచేత చేతిలో చేయి వేయించుకొన్నది. దామోదరయ్యయు సీతనిచ్చి శంకరయ్యను మీ యొద్దనే యుంచుకొమ్మని నిత్యమును మొగమోటపెట్టుచున్నాఁడు. ఇప్పడు నేను పిల్లదానిని మఱియొకరి కిచ్చిన యెడల నా చెల్లెలు పోఁబట్టి యట్లు చేసితినని కలకాలము చెప్పుచుండును. అదిగాక మా శంకరయ్య బహుబుద్ధిమంతుఁడు; స్ఫురద్రూపి; విద్యావినయ సంప న్నుఁడు. పిల్లనాతనికే యిచ్చెదను. జాతకమును మీరు మఱియొక సారి శ్రద్ధతోఁ జూడవలెను.

ఆప్పడు సిద్ధాంతి తాను మఱియొకవిధముగా జెప్పిన కార్యము లేదని తెలిసికాని కొంచెము సే పాకాశమువంకఁ జూచి యనుమానించి